అధ్యక్ష పీఠం ఆశిస్తున్న అగ్రకులాలు..

6 Jan, 2020 08:06 IST|Sakshi

సాక్షి, జమ్మికుంటటౌన్‌ (హుజూరాబాద్‌): జమ్మికుంట పురపాలక సంఘం అధ్యక్ష పీఠంపై అందరి అంచనాలు పటాపంచలు అయ్యాయి. కొన్నాళ్లుగా జోరందుకున్న ఊహాగానాలకు తెరదింపుతూ మున్సిపల్‌ చైర్మన్‌ పదవి ‘జనరల్‌’కు రిజర్వు అయ్యింది. ఫలితంగా బల్దియా ఎన్నికలు రసవత్తరంగా మారేట్లు కనిపిస్తోంది. చైర్మన్‌ కుర్చీకి పోటీ తీవ్రం కానుండగా, ప్రతిష్టాత్మక పదవిని ఈసారి అగ్రకులాలు ఆశిస్తున్నాయి. అన్నీ అనుకూలిస్తే.. సరిగ్గా ఆరు దశాబ్దాల తర్వాత జమ్మికుంటకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కనుంది.

ఊహించని పరిణామం..
1995లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జమ్మికుంట గ్రామపంచాయతీ సర్పంచ్‌ పీఠాన్ని జనరల్‌కు కేటాయించారు. అప్పటి మంత్రి ముద్దసాని దామోదర్‌రెడ్డి చొరవతో çపదవిని బీసీ నాయకుడు పొనగంటి మల్లయ్య కైవసం చేసుకున్నారు. 2001లో బీసీ జనరల్‌కు రిజర్వు కాగా, సర్పంచ్‌గా ఎర్రంరాజు సురేందర్‌రాజు ఎన్నికయ్యారు. 2006లో ఎస్సీ జనరల్‌కు దక్కడంతో కుర్చీపై మద్దూరి శంకరయ్య కొలువు తీరారు. 2014లో జరిగిన నగర పంచాయతీ ఎన్నికల్లో చైర్మన్‌ పీఠం ఎస్సీ జనరల్‌కు కేటాయించగా, అధ్యక్షుడిగా మంత్రి ఈటల రాజేందర్‌ అనుచరుడు పోడేటి రామస్వామి ఎన్నికయ్యారు. ప్రస్తుతం జమ్మికుంట పురపాలక సంఘంగా మారడంతో చైర్మన్‌ పదవికి పోటీ తీవ్రమైంది. అయితే.. గత రెండు దఫాలు ప్రతిష్టాత్మక పదవి ఎస్సీలను వరించడంతో ఈసారి బీసీలను దక్కుతుందని అందరూ భావించారు.

ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పుటి నుంచి ఇవే ఊహాగానాలు జోరందుకోగా, ముందుగానే రంగంలోకి దిగిన కొందరు బీసీ నాయకులు ప్రచారం కూడా చేపట్టారు. అనుచరులతో మంతనాలు జరుపుతూ ఎన్నికలకు సిద్ధమయ్యారు. అయితే బల్దియా పరిధిలో మహిళా ఓటర్లు అధికంగా ఉండడం, జమ్మికుంట చరిత్రలో ఇప్పటి వరకు మహిళల ప్రాతినిథ్యమే లేకపోవడంతో అధ్యక్ష పీఠం అతివలకు అనుకూలంగా రావొచ్చని కూడా భావించారు. బీసీ మహిళ లేదా జనరల్‌ మహిళకు అవకాశం ఇవ్వొచ్చనే ప్రచారం జోరుగా సాగింది. కానీ అందరి అంచనాలకు భిన్నంగా చైర్మన్‌ పదవి జనరల్‌కు రిజర్వు చేశారు. దీంతో జమ్మికుంట “పుర’పోరు రసవత్తరంగా మారనుంది.

తీవ్రం కానున్న పోటీ..
మున్సిపల్‌ చైర్మన్‌ పదవి జనరల్‌కు కేటాయించడంతో ఎన్నికల్లో పోటీ తీవ్రం అయ్యేట్లు కనిపిస్తోంది. ప్రధానంగా జనరల్‌కు రిజర్వు అయిన స్థానాల్లో అత్యధికులు పోటీలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈమేరకు 1, 6, 17, 21, 23, 26, 29 వార్డుల్లో పోరు హోరాహోరీగా ఉంటుందని భావిస్తున్నారు. బీసీలకు కేటాయించిన వార్డుల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంటుందనే వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే గడిచిన 60 ఏళ్లలో జమ్మికుంటకు అగ్రకులాల నాయకులు ప్రాతినిథ్యం వహించిన దాఖలాలే లేవు. 1988, 1995లో సర్పంచ్‌ పీఠం జనరల్‌కు కేటాయించినా, అధికారాన్ని బీసీలే చేజిక్కించుకున్నారు.

ఎట్టకేలకు ఈ దఫా అవకాశం రావడంతో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని అగ్రకులాలు ఆయా పార్టీలపై ఒత్తిడి తెస్తున్నాయి. జమ్మికుంట అభివృద్ధిలో తమదైన ముద్ర వేసేందుకు వీలు కల్పించాలని రెడ్డి, వెలమ, వైశ్య సామాజికవర్గాల నుంచి మంత్రి ఈటల రాజేందర్‌పై ఒత్తిడి తీవ్రమవుతోంది. ఇతర పార్టీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చైర్మన్‌ సీటు జనరల్‌కు రిజర్వు అయినా.. తామూ బరిలోనే ఉన్నామని బీసీ నాయకులు చెబుతున్నారు. పోటీలో వెనక్కి తగ్గేది లేదని, అవకాశాన్ని అందిపుచ్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు.

ప్రధాన పార్టీల దృష్టి..
జమ్మికుంట పురపాలక సంఘంపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో బలమైన నాయకులు చైర్మన్‌ పదవిపై గురిపెట్టుకుని కూర్చున్నారు. జనరల్‌ కేటగిరీ అందరికీ అనుకూలంగా ఉండడంతో వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు అవకాశాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. బడా నేతలు సైతం జమ్మికుంట బల్దియాలో పాగా వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ కంచుకోటను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఎలాగైనా అత్యధిక వార్డుల్లో పాగా వేయాలని, మున్సిపాల్టీలో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతున్నారు. టీఆర్‌ఎస్‌ మాత్రం ఎన్నికల్లో విజయం తమదేనన్న ధీమాతో కనిపిస్తోంది. 

మరిన్ని వార్తలు