బిల్లింగ్ ‘స్పాట్’

18 Jun, 2014 02:13 IST|Sakshi
బిల్లింగ్ ‘స్పాట్’

భువనగిరిటౌన్ : మున్సిపల్ ఆస్తిపన్నును ఆన్‌లైన్ ద్వారా స్పాట్‌బిల్లింగ్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు భువనగిరి మున్సిపాలిటీలో దీనిని ప్రారంభించారు. జిల్లాలో 5మున్సిపాలిటీలు 2నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో భువనగిరి పట్టణంలోని 30వార్డుల్లో ప్రధాన పన్నుల వసూలు కోసం 11స్పాట్ బిల్లింగ్ మిషన్లను ఏర్పాటు చేశారు. ప్రతి మిషన్‌లో 30వార్డులకు సంబంధించి బిల్లింగ్ చేసే అవకాశం ఉంది. పన్ను పెండింగ్ వివరాలను ప్రజలకు ఎప్పటికప్పుడు మెసేజ్ పంపడంతో పాటు బిల్లు చెల్లించగానే సంబంధిత రికార్డులో నమోదు చేయడమే కాకుండా వినియోగదారునికి ధన్యవాదాలు ప్రకటిస్తూ సమాచారం అందుతుంది. భువనగిరి మున్సిపాలిటీలో ఈ నెల 16 నుంచి ఆస్తిపన్నును స్పాట్ బిల్లింగ్ మిషన్ ద్వారా చెల్లిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో నీటి పన్నును కూడా స్పాట్ బిల్లింగ్ ద్వారా చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో మొదటి సారిగా మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీలో ఈ విధానం అమలు చేయగా.. ఇప్పుడు భువనగిరిలో అమలు చేస్తున్నారు. త్వరలో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మున్సిపాలిటీలో ప్రవేశపెట్టనున్నారు.
 
 13వేలు ఇళ్లు..7,200 నల్లా కనెక్షన్లు
 భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటి వరకు 13వేల ఇళ్లకు సంబంధించిన ఆస్తి పన్ను వివరాలను సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచారు. వీటితో పాటు పట్టణంలో ఉన్న 7,200 నల్లాల కనెక్షన్ల పన్ను వివరాలను కూడా పొందుపరుస్తున్నారు. చెక్కు, నగదు, డీడీ ద్వారా కూడా బిల్లులను స్వీకరిస్తారు. బిల్లు చెల్లించగానే సమాచారం సర్వర్ ద్వారా పొందుపరిచే అవకాశం ఉంది.
 
 బిల్ కలెక్టర్లపై నిఘా
 జీపీఎస్, జీపీఆర్‌ఎస్ సిస్టంను సమన్వయం చేయడంతో ఇకనుంచి బిల్ కలెక్టర్లు ఎప్పుడు ఎక్కడ ఉన్నారనే సమాచారం కూడా ఉన్నతాధికారులుకు అందుతుంది. దీంతో బిల్ కలెక్టర్లు విధులను సక్రమంగా నిర్వహించే అవకాశం ఉంది. రశీదులు ఇచ్చి పన్ను వసూలు చేసే విధానం ఇక ఉండదు.
 
 రూపకల్పన చేసినవారు
 స్పాట్ బిల్లింగ్ మిషన్ ద్వారా పన్నులు వసూలు చేసే విధానాన్ని మున్సిపల్ డీఎం జనార్దన్‌రెడ్డి, ఆర్‌డీ సత్యనారాయణతో పాటు ఎంఆర్ కమ్యూనికేషన్ ఆండ్ ఈఆర్‌పీ డెరైక్టర్ రాజశేఖర్ రూపకల్పన చేశారు. ఇప్పటికే మిషన్ ఉపయోగించే వారికి శిక్షణ ఇచ్చారు.
 

మరిన్ని వార్తలు