పాలకవర్గాలకు గడువు నేటితో సమాప్తం

2 Jul, 2019 02:59 IST|Sakshi

రాష్ట్రంలోని మున్సిపాలిటీల పాలకవర్గాలకు ముగిసిన గడువు 

53 మున్సిపాలిటీలు,  3 కార్పొరేషన్లలో ప్రత్యేక పాలన 

కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో ఇప్పటికే ప్రత్యేకాధికారులు 

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపాలిటీల్లో ప్రత్యేక పాలనకు తెరలేచింది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. దీంతో బుధవారం నుంచి పురపాలన ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లనుంది. రాష్ట్రవ్యాప్తంగా పాలకమండళ్ల ఏలుబడిలో ఉన్న 61 నగర/పుర పాలక సంస్థల్లో ప్రస్తుతం 3 కార్పొరేషన్లు, 53 మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం సమాప్తం కానుంది. గ్రేటర్‌ హైదరాబాద్, గ్రేటర్‌ వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట మున్సిపాలిటీల గడువు 2021 వరకు ఉండటంతో.. వీటికి మినహా మిగతా వాటికి ప్రత్యేకాధికారులను నియమిస్తోంది. మరోవైపు కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఇప్పటికే ప్రత్యేక పాలన సాగుతోంది.

తాత్కాలికమే! 
నిర్ణీత వ్యవధిలోపు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం తొలుత భావించినా.. కొత్త పుర చట్టం రూపకల్పనలో జాప్యం జరగడంలో ఆలస్యం జరిగింది. అయితే ఎట్టిపరిస్థితుల్లోఈ నెలాఖరులోపు ఎన్నికలు జరపాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో.. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు, వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పురపాలక శాఖ చకచకా చేస్తోంది. ఈ నెల 14వ తేదీలోపు ఈ క్రతువును పూర్తి చేయడం ద్వారా ఎన్నికలకు లైన్‌క్లియర్‌ చేయాలని నిర్ణయించింది. దీంతో బుధవారం నుంచి కొలువుదీరే ప్రత్యేకాధికారులు.. తాత్కాలికంగానే సేవలందించే అవకాశముంది. కాగా, మున్సిపాలిటీ స్థాయికి అనుగుణంగా కలెక్టర్‌/జాయింట్‌ కలెక్టర్, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ హోదా కలిగిన అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమిస్తున్నట్లు పురపాలక శాఖ డైరెక్టర్‌ టీకే శ్రీదేవి ‘సాక్షి’కి తెలిపారు.  
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు