సమ్మెట

13 Aug, 2015 02:36 IST|Sakshi
సమ్మెట

సంగారెడ్డి మున్సిపాలిటీ : అటు కార్మికుల సమ్మె సడలదు.. ఇటు చెత్త వాహనాలు కదలవు.. దీంతో చెత్త కుప్పల్లా పేరుకుపోతోంది. జిల్లా కేంద్రం, గ్రేడ్-1 మునిసిపాలిటీ అయిన సంగారెడ్డిలో ప్రజారోగ్యం పెనుముప్పు బారిన పడుతోంది. మునిసిపల్ కాంట్రాక్టు కార్మికుల సమ్మెతో పారిశుద్ధ్యం పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. ఇప్పటికే పట్టణానికి చెందిన 17 మందికి డెంగీ లక్షణాలున్నట్టు జిల్లా వైద్యాధికారి ఒకరు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.

 ఒకే ఒక్కడు..
 సంగారెడ్డి మునిసిపాలిటీ పరిధిలో నిత్యం పారిశుద్ధ్య పనులు నిర్వహించేందుకు 160 మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 40 మంది మాత్రమే రెగ్యులర్ కార్మికులు. మిగతా వారంతా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందే. వీరంతా గత 42 రోజులుగా తమ సమస్యల సాధనకు సమ్మె కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కాగా, చెత్త తరలింపు పనుల నిర్వహణకు 5 ట్రాక్టర్లు, 5 ఆటోలు, ఒక డంపింగ్ డోజర్, ఒక హైడ్రాలిక్ డీసీఎం ఉన్నాయి. వీటిని నడిపే డ్రైవర్లంతా కాంట్రాక్టు సిబ్బందే. వీరంతా సమ్మెలో పాల్గొంటున్నారు. రెగ్యులర్ డ్రైవర్ ఒక్కరే ఉన్నారు. దీంతో దాదాపు 40 రోజులుగా మునిసిపల్ కార్యాలయం ఆవరణ నుంచి వాహనాలు కదలడం లేదు. జిల్లా కేంద్రంలో చెత్త గుట్టలుగా పేరుకుపోతోంది. తొలగించే దిక్కులేకపోవడంతో వీధులన్నీ కంపుకొడుతున్నాయి.

 చెత్త ఎత్తే దిక్కులేదు..
 పేరుకే జిల్లా కేంద్రం.. మునిసిపల్ కార్మికులు రోజుల తరబడి విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నా ఇప్పటికీ యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేకపోయింది. మున్సిపాలిటీలో పనిచేస్తున్న 160 మంది కార్మికుల్లోని 40 మంది రెగ్యులర్ సిబ్బంది కాగా, వీరిలో ఎక్కువ మంది మహిళలే. దీంతో వీరు రోడ్లు ఊడ్చడం తప్ప మరే పనులూ చేయలేకపోతున్నారు. చెత్త తరలింపు వాహనాలున్నా.. వాటినే నడిపే వారు, చెత్త ఎత్తే వారు లేకపోవడంతో ప్రధాన చౌరస్తాలతో పాటు కాలనీల్లో చెత్త గుట్టల్లా పేరుకుపోతోంది. ఇంత జరుగుతున్నా.. ఇప్పటికీ ప్రత్యామ్నాయ చర్యల గురించి మునిసిపాలిటీ అధికారులు ఆలోచించడం లేదు.

 రెగ్యులర్ సిబ్బంది లేకే ఇబ్బంది
 సంగారెడ్డి మునిసిపాలిటీలో పని చేస్తు న్న వారిలో ఎక్కువ మంది కాంట్రాక్ట్ కార్మికులే కావడంతో, వారంతా సమ్మె లో ఉండటంతో పారిశుద్ధ్య సమస్య విషమిస్తోంది. అసలే గుట్టల్లా పేరుకున్న వ్యర్థాలు.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు తోడవడంతో భరించలేని వాసన వ్యాపిస్తోంది. కాలనీలన్నీ దుర్గంధభూయిష్టంగా మారిపోయాయి. వీధుల్లో ఎటుచూసినా చెత్తకుప్పలే కనిపిస్తున్నాయి. పూడికతీతకు నోచుకోక మురిగి కాలువలు వ్యర్థాలతో పొంగిపొర్లుతున్నాయి. చెత్త, మురుగునీటి ప్రవాహం, పందుల విహారంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది.

 ప్రబలుతున్న డెంగీ
 అసలే వర్షాకాలం.. సీజనల్ వ్యాధుల ప్రమాదం.. దీనికి తోడు పారిశుద్ధ్య సమస్య తలెత్తడంతో కాలనీలు, మురికివాడల్లో ప్రజలు భీతిల్లుతున్నారు. పట్టణంలో వివిధ కాలనీలకు చెందిన పలువురికి డెంగీ వ్యాధి లక్షణాలు బయటపడినట్టు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. మార్క్స్‌నగర్, ఇంద్రాకాలనీ, నారాయణరెడ్డి కాలనీ, ఎల్‌బీ నగర్, నేతాజీనగర్, రిక్షా కాలనీలకు చెందిన 17 మంది డెంగీ తరహా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారని ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన ఓ వైద్యాధికారి తెలిపారు. పారిశుద్ధ్య లోపమే ఇందుకు కారణం కావచ్చన్నారు.

మరిన్ని వార్తలు