25 నయా నగరం..వేల కోట్ల వ్యయం!

13 Jan, 2020 03:42 IST|Sakshi

ఓఆర్‌ఆర్‌ పరిధిలోని 7 కార్పొరేషన్లకు కావాలి కొత్త లుక్‌

వస్తున్న ఆదాయం.. పారిశుద్ధ్యం, ఉద్యోగుల జీతభత్యాలకే సరి

రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, పార్కులు తక్షణ అవసరం

పలు కార్పొరేషన్లలో మౌలిక వసతుల కల్పనపై ఆస్కీ అధ్యయనం

రూ.25 వేల కోట్ల నిధులు తక్షణ వ్యయం చేయాలని సిఫారసు

సాక్షి, హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌ రోడ్‌ పరిధిలోని పలు నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల్లో సమస్యలు తిష్ట వేశాయి. గ్రామీణ నేపథ్యం నుంచి పట్టణాలుగా.. తర్వాత నగరపాలక సంస్థలుగా వెంటవెంటనే రూపాంతరం చెందినా... పలు సమస్యలు స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలుగ చేస్తున్నాయి. రహదారులు, భూగర్భ డ్రైనేజీ, శానిటేషన్, వీధిలైట్లు, పార్కుల అభివృద్ధి లాంటి సదుపాయాలు మచ్చుకైనా కానరావడం లేదు. ఓఆర్‌ఆర్‌ పరిధిలోని 15 పురపాలక సంస్థలు, 7 కార్పొరేషన్లు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచాయి.

ఈ నగరాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.25 వేల కోట్లు అవసరమవుతాయని ఇటీవల అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ స్థాయిలో నిధులు వెచ్చించే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం.. ఆయా నగరపాలక సంస్థలు లేవు. ఈ నగర పాలక సంస్థలకు ఏటా లభిస్తున్న ఆదాయం అరకొరగా పారిశుద్ధ్య వసతుల కల్పన, ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతోంది. ప్రధానంగా నిజాంపేట్, బోడుప్పల్, మీర్‌పేట్, బడంగ్‌పేట్‌ నగరపాలక సంస్థలకు ఏటా వచ్చే ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉంటోంది.

కార్పొరేషన్లలో ప్రధాన సమస్యలు ఇవే..
►ఈ నగరపాలక సంస్థల్లో పట్టణ ప్రణాళిక గాడి తప్పింది.మాస్టర్‌ ప్లాన్‌ అమలు ఊసేలేదు.
►మురుగునీరు, ఇరుకు రహదారులతో ఇబ్బందులు. 
►గ్రీన్‌ బెల్ట్, పార్కుల అభివృద్ధి లేదు.
►పుట్టగొడుగుల్లా వెలిసిన అక్రమ కట్టడాలను నియంత్రించేవారే కరువయ్యారు.
►గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు మంచినీటి సరఫరా అరకొరే.
►ఘన వ్యర్ధాల నిర్వహణ కాగితాలకే పరిమితం.
►మురుగునీటి శుద్ధి, పునర్వినియోగం జాడే కానరాదు.
►ప్రజారోగ్యం గాల్లో దీపం అయింది. ∙యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాల ఆక్రమణ
►పలు నగరపాలక సంస్థల్లో ముంపు సమస్యతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు ఉండటంలేదు.

కార్పొరేషన్లు /సమస్యలు
నిజాంపేట్‌ 
జనాభా: 3 లక్షలు
ఆదాయం: రూ.30 కోట్లు; వ్యయం: రూ.35 కోట్లు
ప్రధాన సమస్యలు: ముంపు సమస్యలు,
డ్రైనేజీ, మంచి నీటి వసతుల లేమి, ప్రభుత్వ స్థలాల ఆక్రమణ.

బోడుప్పల్‌
జనాభా: 1.35 లక్షలు
ఆదాయం: రూ. 30 కోట్లు; వ్యయం: రూ.32 కోట్లు
సమస్యలు: రహదారులు, పార్కుల లేమి, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి పైపులైన్‌ లీకేజీ.

మీర్‌పేట్‌
జనాభా: 84 వేలు
ఆదాయం: రూ. 23 కోట్లు; వ్యయం: రూ. 25 కోట్లు
సమస్యలు: చెరువుల కలుషితం, భూగర్భ డ్రైనేజీ సదుపాయం లేకపోవడం, తాగునీటి సమస్యలు.

బడంగ్‌పేట్‌
జనాభా: 1.16 లక్షలు
ఆదాయం: రూ.30 కోట్లు; వ్యయం: రూ. 35 కోట్లు
సమస్యలు: అక్రమ కట్టడాలు, డ్రైనేజీ సదుపాయం లేమి, పార్కులు అసలే లేకపోవడం.

త్వరితగతిన చేపట్టాలి...
మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలోని 3 చెరువులు కలుషితం కావడంతో పరిసర కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డైనేజీ నీరు చెరువుల్లో కలవకుండా చేపడుతున్న ట్రంకులైన్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. తోడేటి ప్రసాద్, మీర్‌పేట

నాణ్యతలేని రోడ్లు
మీర్‌పేట కార్పొరేషన్‌లో ప్రధాన రహదారులన్నీ గుంతలమయంగా మారాయి. మున్సిపాలిటీ అధికారులు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా రోడ్లు వేస్తుండటంతో అవి కొన్ని రోజులకే గుంతలమయంగా మారుతున్నాయి. ఇజాజ్‌ మీర్‌పేట

మరిన్ని వార్తలు