బతికున్నట్లుగా సెల్ఫీ అప్లోడ్‌ చేస్తేనే పింఛను!

30 Sep, 2019 08:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బోగస్‌ పింఛన్లకు త్వరలో చెక్‌!

లైవ్‌ సర్టిఫికెట్‌ స్థానంలో అందుబాటులోకి లైవ్‌ యాప్‌

మున్సిపాలిటీల్లో ఇకపై బోగస్‌ పింఛన్లకు అడ్డుకట్ట

వచ్చే నెలలో ఈ విధానం అమలయ్యే చాన్స్‌

బోధన్‌ మున్సిపాలిటీకి చెందిన ఓ వ్యక్తికి ప్రతీ నెలా వృద్ధాప్య పింఛను మంజూరవుతోంది. పింఛన్‌ డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలోనే జమవుతున్నాయి. వాస్తవానికి ఆ వ్యక్తి చనిపోయి చాలా నెలలవుతోంది. అయితే ఇటీవల సదరు వ్యక్తి భార్య వితంతు పింఛన్‌ కోసం అధికారులకు దరఖాస్తు చేసుకుంది. డీఆర్‌డీఏ పింఛన్‌ విభాగంలో అధికారులు ఈ దరఖాస్తును పరిశీలించారు. చనిపోయిన భర్త పేరు తెలుసుకుని మంజూరువుతున్న పింఛన్‌ జాబితాలో ఉందో లేదో చూశారు. ఇప్పటికీ ఆమె చని పోయిన తన భర్త పేరుపై వృద్ధాప్య పింఛ న్‌ ప్రభుత్వం నుంచి మంజూరు అవుతోందని తెలిసి షాక్‌ అయ్యారు. ఇలా మున్సిపా లిటీ ల్లో చనిపోయిన వారి పేరుతో బోగస్‌ పింఛన్లు డ్రా అవుతున్నాయి.

సాక్షి, నిజామాబాద్‌: మున్సిపాలిటీ ప్రాంతాల్లోని బోగస్‌ పింఛన్లకు త్వరలో చెక్‌ పడనుంది. చనిపోయిన వ్యక్తుల పేరిట మంజూరువుతున్న పింఛన్‌లను గుర్తించి తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త సాంకేతిక విధానాన్ని అమలుల్లోకి తేనుంది. అదే ‘లైవ్‌యాప్‌’ సిస్టం. ఈ మొబైల్‌ యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని లబ్ధిదారులు సెల్‌ఫోన్‌లో ఒక సెల్ఫీ ఫొటో దిగి అందులో అప్‌లోడ్‌ చేస్తేనే ఇకపై పింఛన్‌ మంజూరు కానుంది. అయితే ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం ప్రభుత్వం నుంచి ప్రతీ నెలా పింఛన్‌ డబ్బులు పొందుతున్న లబ్ధిదారులు మూడు, ఆరు నెలలకోసారి వారు బతికున్నట్లుగా మున్సిపాలిటీల నుంచి లైవ్‌ సర్టిఫికెట్‌లు పొంది ప్రభుత్వానికి చూపాల్సి ఉంటుంది. ఈ విధానం అమలవుతున్నా లైవ్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ జరగడం లేదు. దీంతో పింఛన్‌లు పొందే లబ్ధిదారులు బతికున్నారో, చనిపోయారో తెలియడం లేదు. పింఛన్‌ డబ్బులు మాత్రం నెలనెలా వారి ఖాతాల్లో జమ అవుతుండగా, కుటుంబ సభ్యులు వాటిని డ్రా చేసుకుంటున్నారు. ప్రభుత్వం నిధులు దుర్వినియోగం అవుతున్నాయి.

అదే గ్రామాల్లోని లబ్ధిదారుల విషయానికి వస్తే ప్రతీ నెలా లబ్ధిదారులే పోస్టాఫీసుకు వెళ్లి పింఛన్‌ డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో లబ్ధిదారులు బతికున్నట్లుగా తెలిసిపోతుంది. కానీ మున్సిపాలిటీ ప్రాంతాల్లో అలా కాకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతున్నాయి. లబ్ధిదారులు బతికున్నారో, లేదో తెలుసుకోవడానికి వీలు పడదు. ప్రస్తుతం జిల్లాలో అన్ని రకాల పింఛన్‌లు కలిపి 2లక్షల 60వేలకు పైగా ఉన్నాయి. వికలాంగులకు రూ.3016 కాగా మిగతా అందరికీ రూ.2,016 పింఛన్‌ అందుతోంది. 

వచ్చే నెలాఖరు వరకు అమలయ్యే ఛాన్స్‌.. 
లైవ్‌ మొబైల్‌ యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా సంగారెడ్డిలో అమలు చేసి విజయవంతమైంది. వచ్చే నెలాఖరు వరకు రాష్ట్రం అంతటా ఈ విధానాన్ని అమలు చేయడానికి కసరత్తు చేస్తోంది. మున్సిపాలిటీ ప్రాంతాల వారే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు కూడా మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని సెల్ఫీ దిగి ఫొటోను అప్లోడ్‌ చేయాల్సి ఉంటుంది. నిరక్ష్యరాసులు, వృద్ధులకు ఇది సాధ్యం కాని పని అయినప్పటికీ తెలిసిన వారితో ఫోన్‌లో సెల్ఫీ ఫొటో దిగి యాప్‌లో అప్లోడ్‌ చేయాల్సిందే. ఇలా ప్రతీఒక్కరూ ప్రతీ మూడు నెలలకు ఒకసారి చేస్తేనే పింఛన్‌ ప్రభుత్వం నుంచి మంజూరు కానుంది. కొత్త విధానం వల్ల మున్సిపాలిటీ ప్రాంతాల్లో చనిపోయిన వ్యక్తులు సెల్ఫీ ఫొటో దిగే అవకాశం ఉండదు కాబట్టి ఇకపై ఆ వ్యక్తికి పింఛన్‌ మంజూరు కాబోదు. దీంతో జిల్లాలో చాలా బోగస్‌ పింఛన్‌లు తొలగిపోయే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు