‘రెరా’... బిల్డర్లు పట్టించుకోరా..? 

4 Jul, 2019 02:35 IST|Sakshi

అవగాహన కల్పించని పురపాలకశాఖ

నెరవేరని చట్టలక్ష్యం 

సాక్షి, హైదరాబాద్‌: స్థిరాస్తి కొనుగోలుదారుకు భద్రతా, భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్థిరాస్తి నియంత్రణ చట్టం (రెరా) కార్యరూపం దాల్చడంలేదు. పునాది పడే ప్రతి ప్రాజెక్టు, లేఅవుట్‌ విధిగా ‘రెరా’లో నమోదు కావాల్సిందేనని చట్టం చెబుతున్నా బిల్డర్లు/డెవలప ర్లు పట్టించుకోవడంలేదు. 2017లో ‘రెరా’చట్టం మనుగడలోకి వచ్చినా.. ఇప్పటివరకు కేవలం 2,500 ప్రాజెక్టులు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా 6 వేల ప్రాజెక్టులకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, ఇతర పట్టణ స్థానిక సంస్థలు (మున్సిపాలిటీలు) ఆమోదముద్ర వేస్తే.. అందులో 2,500 ప్రాజెక్టులే పేర్లను నమోదు చేసుకోవడం చూస్తే ‘రెరా’ అమలులో పురపాలక శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 

జరిమానాతో వెసులుబాటు! 
స్థిరాస్తి నియంత్రణ ప్రాధికార సంస్థలో పేర్లను నమో దు చేసుకోని సంస్థలపై కొరడా ఝళిపించాల్సిన సర్కారు.. జరిమానాలతో సరిపెడుతోంది. రూ.3 లక్షల పెనాల్టీతో రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దీంతో పేరు నమోదు చేసుకోకున్నా ఏం కాదులే అన్న నిర్లక్ష్యం రియల్టీ కంపెనీల్లో కనిపిస్తోంది. పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థలు, డీటీసీపీ వంటి అధికారిక సంస్థల నుంచి అనుమతి పొందిన స్థిరాస్తి సంస్థలు గత నవంబర్‌ 30 వరకు ఆన్‌లైన్‌లో ‘రెరా’లో నమోదు చేసుకునే అవకాశం కల్పించినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఆ తర్వాత రూ. 50 వేల జరిమానాతో గడువు ఇస్తే 50 సంస్థలు ముందుకు రాగా.. రెండోసారి రూ.3 లక్షల పెనాల్టీతో పేర్ల నమోదుకు అవకాశం కల్పించినా ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ చైర్మన్‌ రాజేశ్వర్‌ తివారి ఉత్తర్వులు జారీ చేశారు.  

అవగాహనాలోపం..! 
వినియోగదారులకు విశ్వాసం, నమ్మకం కలిగించేందుకు వీలుగా ‘రెరా’ను పకడ్బందీగా అమలు చేయా లని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. 500 చదరపు మీటర్ల పైబడిన స్థలం, 8 ప్లాట్లతో కూడిన బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు తప్పనిసరిగా ‘రెరా’లో నమోదుచేసుకోవాలనే నిబంధనను తీసుకొచ్చింది. కాగా, ప్రాజెక్టు అంచనా వ్యయంలో 70శాతాన్ని ప్రత్యేక అకౌంట్‌లో జమ చేయాలనే నిబంధన ఉండటంతో రియల్టర్లు ‘రెరా’లో నమోదుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. కొనుగోలుదారులకు భరో సా ఇచ్చేలా.. డెవలపర్లు విధిగా పాటించేలా కొన్ని నిబంధనలు పకడ్బందీగా ఉండటం కూడా వారి వెనుకడుగుకు కారణంగా కనిపిస్తోంది. ‘రెరా’లో నమోదు అనంతరమే.. స్థలాలు, ఫ్లాట్‌లు విక్రయాలకు చెందిన ప్రచారం నిర్వహించుకోవాలనే షరతు విధించింది.

ఈ మేరకు పత్రికా, ప్రసారమాధ్యమా ల్లో ‘రెరా’రిజిస్టర్‌ నంబర్‌ను ప్రచురించాలని స్పష్టం చేసింది. బడా సంస్థలు మినహా మధ్యతరగతి రియల్టీ కంపెనీలు ఈ నిబంధనలు పాటించడంలేదు. భూమి పూజ చేసిందే మొదలు ప్లాట్ల బేరాలను సాగిస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు, లేఅవుట్ల అనుమతులు జారీ చేస్తున్న హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, తదితర సంస్థల సమన్వయం కొరవడడం కూడా ‘రెరా’లో పేర్లు నమోదు కాకపోవడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ‘రెరా’కు తగినంత సిబ్బంది లేకపోవడం.. ఎక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయనే సమాచారం లేకపోవడం ఈ పరిస్థితికి దారితీస్తోంది. రెరా ఆవశ్యకత, చట్టబద్ధత, ప్లాట్ల క్రయవిక్రయాల్లో ఈ చట్టం ఏ రకంగా ఉపయోగపడుతుందనే అం శంపై ప్రజల్లో చైతన్యం కల్పించడంగానీ, ప్రచారం చేయడంలో  పురపాలక శాఖ  విఫలమైంది. దీంతో ఈ చట్టంపై సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అవగాహన లేకుండా పోయింది.  

భారీగా జరిమానాలు 
ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్న కారణంతో బిల్డర్లపై రెరా సంస్థ భారీగానే జరిమానాలు విధిస్తోంది. ఇప్పటివరకు 400 ప్రాజెక్టులపై రూ.50వేల నుంచి రూ.3లక్షల వరకు జరిమానాలు విధించి రూ.3 కోట్లు వసూలు చేసింది. ఇవి కేవలం బడాసంస్థలకు సంబంధించినవి మాత్రమే కాగా, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ పరిధిలోని అనధికార లేఅవుట్లు, అపార్ట్‌మెంట్ల విషయంలో తాత్సారం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. అయితే, ‘రెరా’అధికారులు మాత్రం మధ్యతరగతి రియల్‌ మోసాలు తమ వరకు రావడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ‘రెరా’లో నమోదు చేసుకోకుండానే వెంచర్లు చేసి అమ్ముకుంటున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అయితే, 2017 జనవరి తర్వాత వెలిసిన లేఅవుట్ల విషయంలో ఇప్పటి నుంచి పకడ్బందీగా వ్యవహరిస్తామని ‘రెరా’కార్యదర్శి విద్యాధర్‌ ‘సాక్షి’కి తెలిపారు. అక్రమ లేఅవుట్ల స్థలాలు రిజిస్ట్రేషన్‌ కాగానే సమాచారం తమకు వచ్చే విధంగా రిజిస్ట్రేషన్ల శాఖతో సమన్వయం కుదుర్చుకునే పనిలో ఉన్నామని, సదరు డెవలపర్‌కు చెందిన సమస్త సమాచారాన్ని ఆ శాఖ నుంచి తీసుకుంటామని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. 

మరిన్ని వార్తలు