ఆత్మహత్య కాదు.. హత్యే..

13 Nov, 2014 03:56 IST|Sakshi

సిరిసిల్ల టౌన్:  సిరిసిల్లలో మంగళవారం నవవధువు లక్ష్మి(22) ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. భర్త, అత్తింటివారే లక్ష్మిని హత్యచేశారని బుధవారం బంధువులు ఆరోపించారు. ఏరియా ఆస్పత్రిలోని పోస్టుమార్టమ్ గది వద్ద ఆందోళకు దిగారు. వివరాలు బంధువుల కథనం మేరకు... పట్టణంలోని సాయినగర్‌కు చెందిన శాగల తిరుపతి మున్సిపల్‌లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈయనకు ఆరు నెలల క్రితం నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం పోచానిపల్లికి చెందిన లక్ష్మితో వివాహం అయింది.

పెళ్లి సమయంలో లక్ష్మి తల్లిదండ్రులు నాలుగు తులాల బంగారం, 20 తులాల వెండి ఇచ్చారు. కామారెడ్డిలోని సగం ఇల్లును ఇస్తామని ఒప్పుకున్నారు. పెళ్లయిన తర్వాత అవసరానికి రూ.50 వేలతో పాటు బైక్‌ను కొనిచ్చారు. తరుచూ..తిరుపతి తమ కుటుంబ సభ్యులతో కలిసి డబ్బులకోసం లక్ష్మిని వేధించాడు. ఈవిషయంలో గతంలో కొంత డబ్బు ఇచ్చి కలిసి ఉండాలని కోరినట్లు బంధువులు తెలిపారు. అయినా తిరుపతిలో మార్పు రాలేదు. మంగళవారం తిరుపతి డ్యూటీకి వెళ్లి వచ్చే సరికి  ఇంట్లో ఫ్యానుకు చున్నితో లక్ష్మి ఉరేసుకుంది అసత్యమని, భర్తే చంపి ఫ్యానుకు ఉరేసుకున్నట్లు చిత్రీకరించాడని బంధువులు ఆరోపించారు.

 పోలీసుల తీరుపై బంధువుల ఆగ్రహం
 మంగళవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో కేసును నమోదు చేయడానికి వెళ్లిన లక్ష్మి బంధువుల పట్ల పోలీసులు అనుమానాస్పదంగా వ్యవహరించారని ఆరోపించారు. స్టేషన్‌లోని ఓ పోలీస్ అధికారి నిందితుడు తిరుపతికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. హత్య కేసును నమోదు చేయాలని తాము కోరగా సదరు అధికారి ఆత్మహత్యగా ఫిర్యాదు చేయమని కోరినట్లు తెలిపారు. చివరకు సీఐ విజయ్‌కుమార్ కలగజేసుకుని బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నట్లు వెల్లడించారు.

డీఎస్పీ దామెర నర్సయ్య చొరవ చూపి లక్ష్మి మృతిచెందిన ఇంటిని పరిశీలించారు. మృతురాలి బంధువులు, పెద్దమనుషులను జరిగిన సంఘటనపై తహశీల్దార్ మన్నె ప్రభాకర్ ముందు పూర్వాపరాలు తెలుసుకున్నారు.దోషులను పట్టుకుని శిక్షపడేలా చేస్తామని పోలీసులు ఎవరికీ అతీతులు కాదని లక్ష్మి బంధువులకు నచ్చజెప్పారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తామని డీఎస్పీ తెలిపారు.

మరిన్ని వార్తలు