వీడు తండ్రేనా!

24 May, 2015 00:33 IST|Sakshi
వీడు తండ్రేనా!

బాలిక ‘హత్యా’చారం కేసులో వీడిన మిస్టరీ
 
తండ్రే హంతకుడని తేల్చిన పోలీసులు
కన్న కూతురిని చెరిచి చంపినట్టు నిర్ధారణ
కట్టుకథ అల్లి తప్పుదోవ పట్టించిన దుర్మార్గుడు!
దుండగుల అఘాయిత్యమంటూ నాటకం..
నేరచరిత్ర ఉండడంతో అనుమానించిన పోలీసులు
విచారణలో నిగ్గుతేలిన నిజం
పోలీసుల అదుపులో మానవమృగం

 
 తండ్రంటే.. అన్నీ తానై కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడేవాడు. తోడుగా, నీడగా వెంటుండి నడిపించేవాడు. భవిష్యత్తంతా బంగారు బాట కావాలని వేలు పట్టుకుని దారి చూపేవాడు. అలాంటి తండ్రి అనే మాటకు మచ్చతెచ్చాడో దుర్మార్గుడు. కామంతో కళ్లు మూసుకుపోయి.. కన్న కూతుర్నే చెరిపి కడతేర్చాడు. సభ్యసమాజం తలదించుకునేలా ఇంటిదీపాన్ని ఆర్పేశాడు. పద్నాలుగేళ్ల బాలిక సిమ్రాన్ ‘హత్యా’చారం కేసులో ఒళ్లు గగుర్పొడిచే నిజం బయటకు రావడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కన్న తండ్రే కాలయముడని, అమానుషంగా హతమార్చాడని తేలడంతో నివ్వెరపోయింది. ఈ కేసులో సిమ్రాన్ తండ్రి కమాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.     - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
 
 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టంపల్లికి చెందిన మెగావత్ కమల్ తన కూతురు సిమ్రాన్‌పై ఆఘాయిత్యానికి పాల్పడి చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. లింగంపల్లిలో వేసవి సెలవులకు వెళ్లిన కూతురును వికారాబాద్‌కు తీసుకొచ్చిన కమల్.. అంతకుముందే మద్యం సేవించాడు. స్థానిక రాజీవ్‌గృహాకల్పలో ఉంటున్న మరదలు ఇంట్లో బిడ్డను దిగబెట్టి.. మోపెడ్‌లో పెట్రోల్‌కని వచ్చి మరోసారి మందు తాగారు.

ఆ తర్వాత కూతురుతో సొంతూరుకు పయనమాయ్యరు. అయితే, తండాకు దగ్గరి రూట్‌ను కాదని మోత్కుపల్లి గేటు గుండా పోవడంతో కన్నతండ్రి రాక్షస మనస్థత్వాన్ని అంచనా వేయలేకపోయింది బాలిక. మోత్కుపల్లి గేటు సమీపంలో మోపెడ్‌ను ఆపి.. కూతురుపై ఆఘాయిత్యానికి పాల్పడడంతో బాలిక కేకలు విన్న స్థానికులు.. సంఘటనాస్థలికి వచ్చి కమల్‌ను చితకబాదారు. ‘మనిషివా.. పశువువా’ అంటూ నాలుగు తన్నడంతో ఇంటికి వెలుతున్నామని నటించి అక్కడి నుంచి జారుకున్నారు.

తండ్రి, కూతురు మోపెడ్‌పై బయలుదేరడంతో స్థానికులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిదూరం వెళ్లిన కమల్ మరోసారి తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. బాలికపై దారుణానికి ఒడిగట్టి చంపేశారు. అనంతరం దుండగులు దాడిచేసి తన కూతురును ఆటోలో అపహరించారని కట్టు కథ అల్లాడు. దీంతో స్థానికంగా కలకలం సృష్టించిన ఈ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీశారు. స్థానికంగా 30 మంది ఆటోడ్రైవర్లను ప్రశ్నించినా ఆధారాలు లభించలేదు. మరోవైపు పోలీసు జాగిలాలు సమీపంలోని బార్వాద్ గ్రామంలో ఆరుగురు ఇళ్లకు వెళ్లి ఆగిపోవడంతో బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందనే కోణంలోనే దర్యాప్తు సాగించారు.

 అనుమానం వచ్చింది ఇలా..!
 ఆటో ముఠా తనపై దాడి చేయడంతో స్పృహ తప్పి పడిపోయానని, దారిన పోయే డీసీఎం వాహనం డ్రైవర్ తనను గుర్తించి లేపారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ డ్రైవర్ ఎవరనేది చెప్పకపోవడంతో పోలీసులకు అనుమానం కలిగింది. అంతేకాకుండా కమల్ బలిష్టిగా ఉండడం, బలమైన గాయాలు లేకపోవడంతో అనుమానానికి బలం చేకూరింది.

 ఈ నేపథ్యంలో శనివారం ఉదయం మోమిన్‌పేట ఠాణాకు పిలిపించి ప్రశ్నించారు. అంతకుముందు సంఘటనాస్థలిలో చెప్పిన సమాధానం.. స్టేషన్‌లో ఇచ్చిన వాంగ్మూలం పొంతనలేకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టింది కన్న తండ్రే అనే నిర్ధారణకు వచ్చారు. అంతేకాకుండా అతడు గతంలో పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉండడంతో తమదైన శైలిలో మరోసారి విచారించగా  పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించారు.

మరిన్ని వార్తలు