మూసీలో మినీ విద్యుత్ కేంద్రం!

1 Oct, 2016 05:06 IST|Sakshi
మూసీలో మినీ విద్యుత్ కేంద్రం!

- హైకోర్టు-ఉస్మానియా ఆస్పత్రి మధ్య ఏర్పాటు చేసే యోచన
- మూడు మెగావాట్ల సామర్థ్యంతో స్థాపనకు అవకాశం
 
 సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కుండపోత వర్షాలకు పోటెత్తిన వరదతో ఉగ్రరూపం దాల్చిన మూసీ నదిలో మూడు మెగావాట్ల సామర్థ్యంతో మినీ విద్యుత్ కేంద్రం స్థాపిస్తే ఉపయుక్తంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఈమేరకు మూసీలో వరద ప్రవాహం, రోజువారీగా ప్రవహిస్తున్న నీటి పరిమాణం, ఏ ప్రాంతంలో దీన్ని స్థాపించాలన్న అంశంపై సమగ్ర సర్వే చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. వికారాబాద్ అనంతగిరి కొండల్లో నుంచి 90 కి.మీ. ప్రవహించి నగరంలో బాపూఘాట్ వద్ద రాజధానిలోకి ప్రవేశిస్తోంది. గ్రేటర్ పరిధిలో సుమారు 44 కి.మీ. మేర ప్రవహిస్తోంది. అయితే ఇప్పటికే నయాపూల్ బ్రిడ్జి (హైకోర్టు-ఉస్మానియా మధ్యన) ఆనుకొని నిర్మించిన రబ్బరు డ్యామ్ స్థానంలో 100 అడుగుల ఎత్తున డ్యామ్ నిర్మించాలని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాని కింద భూగర్భ విద్యుత్ కేంద్రం, టర్మైన్లను ఏర్పాటు చేయడంద్వారా వరద నీరు ఈ డ్యామ్‌లో నిల్వచేసేలా ఆలోచిస్తున్నారు. ఆ నీటిని ఒక్కసారిగా విడుదల చేయడంతో ఆ ఒత్తిడికి టర్బైన్లు తిరిగి సుమారు 3 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని భావిస్తున్నారు. దీనంతటికీ రూ.300 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.

 1,400 మిలియన్ లీటర్ల ప్రవాహం...
 మూసీ నదిలోకి నిత్యం గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి 1,400 మిలియన్ లీటర్ల మురుగు నీరు ప్రవేశిస్తోంది. ఇందులో 600 మిలియన్ లీటర్ల నీటిని అంబర్‌పేట్, నాగోల్, నల్లచెరువు, అత్తాపూర్ మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేస్తున్నారు. మిగతాది మూసీలో కలిసిపోతోంది. ఇందుకోసం పదిచోట్ల మురుగు శుద్ధి కేంద్రాలు, రెండు చోట్ల రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు జలమండలి రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో గతంలో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మూసీలోకి ప్రవేశిస్తున్న నీటిని శుద్ధి చేసిన అనంతరం ఎస్టీపీల నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ప్రతిపాదిత డ్యామ్‌కు తరలించి... అక్కడ విద్యుదుత్పత్తి చేయడం సాధ్యపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ రోజువారీగా ఉత్పత్తి చేసే 3 మెగావాట్ల విద్యుత్‌ను పవర్‌గ్రిడ్‌కు అనుసంధానిస్తే నగరంలోని స్టోరేజీ రిజర్వాయర్ల నుంచి నీటి పంపింగ్ కేంద్రాలకు అవసరమైన విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
 
 త్వరలో సర్వే...
మూసీలోకి సీజన్‌లో ప్రవహించే వరద ప్రవాహం, రోజువారీగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న మురుగు, ఎస్టీపీల వద్ద శుద్ధిచేస్తున్న నీటి పరిమాణం, హైకోర్టు-ఉస్మానియా ఆస్పత్రి సమీపంలో వంద అడుగుల ఎత్తున డ్యామ్ నిర్మాణం తదితర అంశాలపై విద్యుత్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాఖల ఆధ్వర్యంలో అధ్యయనం చేయాలని ప్రభుత్వం సంకల్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మినీ విద్యుత్ కేంద్రం నెలకొల్పడంతో మూసీ నది ప్రక్షాళనతోపాటు, సుందరీకరణ ప్రక్రియ కూడా సాధ్యపడుతుందని.. ఈప్రాంతం ప్రముఖ పర్యాటక ప్రాంతంగానూ వెలుగొందుతుందనేది నిపుణుల అభిప్రాయం.

మరిన్ని వార్తలు