మూసీపై మరో అధ్యయన యాత్ర

25 Apr, 2019 07:33 IST|Sakshi

సబర్మతి, హుగ్లీ నదులపై స్టడీ టూర్‌  

తరలివెళ్లిన మూసీ కార్పొరేషన్‌ అధికారులు

త్వరలో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక  

నివేదికను సర్కారుకు సమర్పించే అవకాశం

సాక్షి, సిటీబ్యూరో: మూసీ సుందరీకరణపై మరో అధ్యయన యాత్రకు మూసీ కార్పొరేషన్‌ అధికారులు శ్రీకారం చుట్టారు. గుజరాత్‌లోని సబర్మతి, కోల్‌కతాలోని హుగ్లీ నది తరహాలో మూసీ నదిని అభివృద్ధి చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఆయా నగరాలకు ఇటీవల వెళ్లారు. మూసీ కార్పొరేషన్‌ ఎండీ అశోక్‌రెడ్డి నేతృత్వంలో జీహెచ్‌ఎంసీ, జలమండలి, హెచ్‌ఎండీఏ అధికారుల బృందం ఈ అధ్యయనం నిర్వహించనుంది. త్వరలో మూసీ నది సుందరీకరణ, పరిరక్షణపై సమగ్ర యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించనుంది. ఇటీవల రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు.. మూసీ పరిరక్షణ, సుందరీకరణ పనులపై సర్కారు అలసత్వం వహిస్తోదంటూ ఆగ్రహం వ్యక్తంచేసిన నేపథ్యంలో ఈ అధ్యయన యాత్ర ప్రాధాన్యాన్ని  సంతరించుకుంది.

కాగితాలపైనే మూసీ..  
చారిత్రక మూసీ నది ప్రక్షాళనలో భాగంగా తొలివిడత గాపురానాపూల్‌ చాదర్‌ఘాట్‌ (3కి.మీ) మార్గంలో సుందరీకరణ చేపట్టే పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. మూసీ చుట్టూ ఆకాశమార్గాల నిర్మాణం, నదీ పరీవాహక మార్గంలో తీరైన ఉద్యానాలు ఏర్పాటు చేయడం ద్వారా సుందరీకరణ పనులు చేపట్టేందుకు వీలుగా అవసరమైన డిజైన్లను పది స్వదేశీ, విదేశీ సంస్థలు ఆరునెలల క్రితమే సమర్పించినప్పటికీ అడుగు ముందుకుపడటంలేదు. మూసీనది పడమర భాగంలో ఉన్న ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌ సాగర్‌లతో పాటు తూర్పున ఉన్న గౌరెల్లి (ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపం) వరకు సుమారు 57.50 కి.మీ మార్గంలో సుందరీకరణ, పరిరక్షణ, అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికల తయారీకి.. మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అంతర్జాతీయ స్థాయి డిజైన్‌ సంస్థలను ఆహ్వానించిన విషయం విదితమే. ప్రపంచ స్థాయి ప్రమా ణాలు, వినూత్న విధానాల ద్వారా మూసీ సుందరీకరణ ప్రాజెక్టును చేపట్టాలనే  విషయం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ పనులు పట్టాలెక్కకపోవడంపై  నగరవాసులు, పర్యావరణ వాదులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. 

డిజైన్లు ఘనం.. ఆచరణ శూన్యం..
తీరైన పట్టణ ప్రణాళిక, సుందరీకరణ అంశాల్లో పేరొందిన ప్రతిష్టాత్మక సంస్థలు పురానాపూల్‌– చాదర్‌ఘాట్‌ మార్గంలో సుందరీకరణ పనులు చేపట్టేందుకు మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ గతంలో డిజైన్‌ కాంపిటీషన్‌ నిర్వహించింది. దీంతో అంతర్జాతీయంగా పేరొందిన సంస్థలు తాము రూపొందించిన డిజైన్లను కార్పొరేషన్‌కు సమర్పించాయి. ఇందులో అత్యుత్తమ డిజైన్‌ను ఎంపిక చేయడంలో ఆరునెలలుగా మూసీ కార్పొరేషన్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం గమనార్హం.  

చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా..  
సుందరీకరణ పనుల్లో భాగంగా మూసీలో ఆవరణ వ్యవస్థను పరిరక్షించడం, హైదరాబాద్‌ నగర చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా వివిధ అభివృద్ధి పనులకు తక్షణం శ్రీకారం చుట్టాల్సిన అవసరముందని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. ఇందుకోసం ‘ట్రాన్స్‌ఫార్మింగ్‌ హైదరాబాద్‌: మూసీ రివర్‌ రివిటలైజేషన్‌’ పేరుతో నిర్వహించిన డిజైన్‌ కాంపిటీషన్‌లో వివిధ సంస్థలు సమర్పించిన డిజైన్లలో అత్యుత్తమ డిజైన్‌ను ఎంపికచేయాలని సూచిస్తున్నారు.  

నీరుగారుతున్న లక్ష్యం..
ఇక అత్యుత్తమ డిజైన్‌ను ఎంపిక చేసి పురానాపూల్‌ చాదర్‌ఘాట్‌ మార్గంలో డిసెంబరు నెలలో సుందరీకరణ, తీరైన ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్లు ఏర్పాటుచేసే పనులను ప్రారంభించాలని లక్ష్యం నిర్దేశించారు. 2019 ఏప్రిల్‌ నాటికి ఈ పనులు పూర్తిచేసి ప్రజల సందర్శనకు వీలుగా ఏర్పాట్లు చేయాలనుకున్నప్పటికీ ఇప్పటికీ అడుగు ముందుకుపడకపోవడం గమనార్హం. 

అధికారులేమంటున్నారు..  
మూసీ ప్రవాహ మార్గంలో 57.50 కి.మీ మార్గంలో ఈస్ట్‌వెస్ట్‌ కనెక్టివిటీ, సుందరీకరణ, పరిరక్షణ పనులను జనవరి 2019లో ప్రారంభించి రెండున్నరేళ్లలోగా పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేసినట్లు మున్సిపల్‌ పరిపాలన శాఖ అధికారులు చెబుతున్నారు. మూసీ సుందరీకరణ, పరిరక్షణ చర్యల్లో భాగంగా నదీ ప్రవాహ మార్గంలోఘన, ద్రవ వ్యర్థాలు, మురుగునీరు చేరకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.  

మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కోసం..
సాక్షి, సిటీబ్యూరో: మూసీ రివర్‌ఫ్రంట్‌ను అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేసేందుకు ఇతర నగరాల్లోని రివర్‌ఫ్రంట్‌ల అభివృద్ధిని అధ్యయనం చేసేందుకు జీహెచ్‌ఎంసీతో సహా వివిధ విభాగాల అధికారులు అహ్మదాబాద్, కోల్‌కతా నగరాలకు వెళ్లారు. సోమవారం అహ్మదాబాద్‌లో సబర్మతి రివర్‌ఫ్రంట్‌ అభివృద్ధి కార్యక్రమాలను, అక్కడి సబర్మతి నదిని ఎంతకాలంగా, ఎలా అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దింది పరిశీలించారు. మంగళవారం దాని అభిృద్ధికి సంబంధించి స్థానిక అధికారులు వీరికి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. బుధవారం కోల్‌కతాలోని హుగ్లీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ను పరిశీలించిన వీరు రెండు రివర్‌ఫ్రంట్‌ల అభివృద్ధికి సంబంధించి  ప్రభుత్వానికి అధ్యయన నివేదిక అందజేయనున్నారు. వీటితో మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌కు అనువైన టెక్నాలజీతో మూసీ పరిసరాల్ని తీర్చిదిద్దనున్నారు. మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌డీసీఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.అశోక్‌రెడ్డి నేతృత్వంలో అధ్యయనానికి వెళ్లిన బృందంలో జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ జె.శంకరయ్య, చార్మినార్‌ జోనల్‌ కమిషనర్‌ బి.శ్రీనివాసరెడ్డి, జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌(ప్రాజెక్ట్‌) సురేష్‌కుమార్, జలమండలి, ఎంఆర్‌డీసీఎల్‌ల అధికారులున్నారు.  

మూసీ కారిడార్‌ అభివృద్ధి పనులిలా..
పురానాపూల్‌– చాదర్‌ఘాట్‌ మార్గంలో 3 కి.మీ మార్గంలో మూసీ సుందరీకరణ, తీరైన ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్లను తీర్చిదిద్దడం
రివర్‌ఫ్రంట్‌ సుందరీకరణ పనుల్లో భాగంగా నగరంలో మూసీ ప్రవహిస్తున్న 57 కి.మీ మార్గంలో దశలవారీగా సుందరీకరణ పనులు చేపట్టడం

మరిన్ని వార్తలు