‘మూసీ’ స్థలాల్లో కబ్జాల జోరు!

14 Mar, 2020 08:58 IST|Sakshi

మూసీ నది తీర స్థలాల పరిరక్షణపై నిర్లక్ష్యం

అక్రమార్కుల అడ్డాలుగా మారుతున్న వైనం  

ప్రభుత్వ సైన్‌ బోర్డుల సాక్షిగా పాగా

సాక్షి, సిటీబ్యూరో: నగరం నడిబొడ్డున ఉన్న మూసీ నది తీరప్రాంతాల్లోని ఖాళీ స్థలాలకు పర్యవేక్షణ కరువైంది. పరివాహక ప్రాంతంలో గుర్తించిన ఆక్రమిత స్థలాలు సైతం దర్జాగా మళ్లీ మళ్లీ కబ్జాలకు గురవుతున్నా.. పట్టింపు లేకుండా పోయింది.  ప్రభుత్వ సైన్‌ బోర్డుల సాక్షిగా అక్రమార్కులు తమ అవసరాలకు అనుగుణంగా వాటిని వినియోగించుకొని సొమ్ము చేసుకుంటున్నారు. సరిగ్గా గతేడాన్నర క్రితం మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రభుత్వ ఖాళీ స్ధలాల ఆక్రమితపై రెవెన్యూ యంత్రాంగం కొరఢా ఝలిపించింది. చార్మినార్‌ మండల పరిధిలోని మూసీ పరివాహక  ప్రాంతంలో ఆరు స్థలాల్లో ఆక్రమణలు తొలగించడంతో పాటు చాదర్‌ఘాట్‌ నుంచి ఇమ్లిబన్‌కు వెళ్లే  దారిలో రోడ్డు పక్కన వెలిసిన ప్రైవేటు ల్యాండ్‌ అనే బోర్డును తొలగించి ప్రభుత్వ సైన్‌బోర్డును ఏర్పాటు చేశా రు. ఖాళీ స్థలంలో అక్రమంగా నిలుపుతున్న వాహనాలను ఖాళీ చేయించి అక్కడి స్థలంలో సైతం మరో సైన్‌ బోర్డు ఏర్పాటు చేశారు. అది కాస్త మూన్నాళ్ల ముచ్చటగా తయారైంది. యథాతథంగా ఖాళీ స్థలం ప్రయివేటు బస్సులు, వాహనాలకు అడ్డాగా మారింది. కొన్నిచోట్ల మళ్లీ గుడిసెలు వెలిశాయి.

ఆక్రమిత స్థలాలు 8529 పైనే.
నగరంలోని మూసీ ప్రరివాహక ప్రాంతంలో ఆక్రమిత స్థలాలు  8529 పైనే ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. వాస్తవంగా గతేడాదిన్నర క్రితం హైదరాబాద్‌ జిల్లా రెవెన్యూ యంత్రాంగం, మూసీ రివర్‌ అథారిటీ సంయుక్తంగా మూసీ నదీ తీర ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాలపై దృష్టి సారించి ఆక్రమిత స్థలాలను గుర్తించింది. ఇందుకు అప్పట్లో  తొమ్మిది బృందాలు రంగంలో దిగి మూసీ నదీ పారుతున్న ఎనిమిది మండలాల పరిధిలో వాస్తవ పరిస్ధితిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాయి. మండలాల వారిగా మూసి నది మొత్తం, పొడవు,ఆక్రమణల ఫొటోలు, వీడియోగ్రాఫ్‌లతో పాటు కేటగిరిల వారిగా పూర్తి స్థాయి వివరాలు సేకరించి వాటి రక్షణ చర్యలు చేపట్టినా..అవి కాగితాలకే పరిమితమయ్యాయి.   

మండలాల వారిగా...
నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో మండల వారిగా ఆక్రమిత స్థలాలను పరిశీలిస్తే... ఆసిఫ్‌నగర్‌ మండలంలో 667, అంబర్‌పేట పరిధిలో 989, బహద్దూర్‌పురా పరిధిలో 4,225, చార్మినార్‌ పరిధిలో 73, గోల్కొండ పరిధిలో 517, హిమాయత్‌నగర్‌ పరిధిలో 499,  నాంపల్లిలో 658, సైదాబాద్‌ పరిధిలో 902 ఆక్రమిత స్థలాలు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికై రెవెన్యూ యంత్రాంగం అక్రమిత స్థలాలపై దృష్టి సారించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు