కాలుష్య కోరల్లో మూసీ

11 May, 2019 07:23 IST|Sakshi

రసాయన వ్యర్థాలతో విలవిల

సిటీలోనే అత్యధిక కాలుష్యం నమోదు

పీసీబీ తాజా నివేదికలో వెల్లడి

ఎస్టీపీల నిర్మాణం తక్షణ అవసరం

సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక మూసీ కాలుష్య కోరల్లో చిక్కి విలవిలలాడుతోంది. ఈ నదిలో కాలుష్య మోతాదు అనూహ్యంగా పెరిగినట్లు పీసీబీ తాజా నివేదికలో వెల్లడైంది. మహానగరం పరిధిలోని గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి నిత్యం విడుదలవుతున్న 1,600 మిలియన్‌ లీటర్ల మురుగు నీటిలో జలమండలి కేవలం 800 మిలియన్‌ లీటర్ల వ్యర్థ జలాలను మాత్రమే ఆరు ఎస్టీపీల్లో శుద్ధి చేస్తోంది. మరో 800 మిలియన్‌ లీటర్ల వ్యర్థ జలాలు ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే మూసీలో కలుస్తుండడంతోనే ఇది రోజురోజుకూ కాలుష్య కాసారమవుతోంది.

పరిశ్రమల కారణంగానే..
కొందరు పరిశ్రమల నిర్వాహకుల కాసుల కక్కుర్తి మూసీ ఉసురు తీస్తోంది. బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్‌ కంపెనీల నుంచి వెలువడుతున్న ప్రమాదకర పారిశ్రామిక, రసాయన వ్యర్థాలను నిబంధనల ప్రకారం సమీపంలోని శుద్ధి కేంద్రాలకు పంపించాల్సి ఉంటుంది. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒక్కో ట్యాంకర్‌కు రూ.10వేలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా రాత్రిపూట సెప్టిక్‌ ట్యాంకర్లు, నీళ్ల ట్యాంకర్లు, డీసీఎంల్లో నగర శివారుల్లోకి తరలించి మూసీలో డంప్‌ చేస్తుండటంతో మూసీ కాలుష్య కాసారమవుతోంది. 

పరిమితులివీ..
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్దేశిత పరిమితుల ప్రకారం లీటర్‌ నీటిలో డీఓ పరిమాణం కనీసం 4 ఎంజీలుండాలి. అంతకంటే తక్కువగా ఉంటే ఆ చెరువు లేదా కుంటలో జలచరాలు బతకవు. బీఓడీ విషయానికొస్తే లీటర్‌ నీటి లో 3 ఎంజీలను మించకూడదు. డీఓ తగ్గుతున్న కొద్దీ బీఓడీ పెరుగుతుంది. ఇలా జరుగుతుంటే ఆ జల వనరుల్లో కాలుష్యం పెరుగుతుందని అర్థం.

మూసీ ప్రస్థానం ఇలా..
ఈ నది వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి హిల్స్‌లో పుట్టి.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మీదుగా ప్రవహించి మిర్యాలగూడకు సమీపంలోని వాడపల్లి దగ్గర కృష్ణా నదిలో కలుస్తోంది. మొత్తం 250 కి.మీ. ప్రవహిస్తోంది. దేశంలోని అత్యంత కలుషితమైన నదుల్లో ఇదీ చేరిందంటే.. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వివిధ ప్రాంతాల్లో నది నీటి నాణ్యతను పీసీబీ ఎప్పటికప్పుడు పరీక్షిస్తోంది. తాజాగా.. 2017లో కాలుష్య తీవ్రతపై ప్రత్యేక నివేదికను రూపొందించింది.

ప్రక్షాళనకు ప్రణాళిక ఇదే..
మూసీ నదిని కాలుష్యం కోరల నుంచి రక్షించాలంటే రెండో దశ ప్రక్షాళన పథకాన్ని తక్షణం పూర్తి చేస్తే కొంత మేర ఉపశమనం ఉంటుంది. ఇందుకు రూ.2000 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది.  
మూసీ నది ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఐదేసి చొప్పున నూతనంగా మొత్తం.. పది సీవరేజి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటుచేయాల్సి ఉంది.
ఎస్టీపీలు నిర్మించాల్సిన ప్రాంతాలు: అంబర్‌పేట్‌ (142ఎంఎల్‌డీ), నాగోల్‌(140ఎంఎల్‌డీ), నల్లచెరువు (80ఎంఎల్‌డీ), హైదర్షాకోట్‌ (30), అత్తాపూర్‌ (70ఎంఎల్‌డీ), మీరాలం(6ఎంఎల్‌డీ), ఫతేనగర్‌ (30ఎంఎల్‌డీ), ఐడీపీఎల్‌ టౌన్‌షిప్‌ (59ఎంఎల్‌డీ), నాగారం(29ఎంఎల్‌డీ), కుంట్లూర్, హయత్‌నగర్‌ (24 ఎంఎల్‌డీ) రీసైక్లింగ్‌ యూనిట్లు: ఫతేనగర్, ఐడీపీఎల్‌ టౌన్‌షిప్, నాగారం కాప్రా

కాలుష్యమిలా..
బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (బీఓడీ) బాపూ ఘాట్‌ వద్ద 28 మిల్లీ గ్రాములు, నాగోల్‌ వద్ద 26, ప్రతాపసింగారం వద్ద 26 మిల్లీగ్రాముల మేర నమోదవడం గమనార్హం. ఇది నిర్దేశిత పరిమితుల కంటే చాలా అధికం.   
నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ (డీఓ) బాపూఘాట్‌ వద్ద 1.6 ఎంజీ, నాగోల్‌ వద్ద 0.06 ఎంజీ, ప్రతాపసింగారం వద్ద 1.0 ఎంజీగా నమోదైంది. అంటే నీటిలో కరిగిన ఆక్సిజన్‌ శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో జలచరాల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది.

మరిన్ని వార్తలు