31న స్పర్శ్‌ నైట్‌ సంగీత విభావరి  

27 Mar, 2018 13:59 IST|Sakshi
మాట్లాడుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం  

బంజారాహిల్స్‌:  జీవితాన్ని కేవలం డబ్బుతో ముడి పెట్టవద్దని డబ్బుతో మంచి పనులు కూడా చేయవచ్చని కొందరు నిరూపిస్తూ మిగతా వారికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఈ నెల 31న మాదాపూర్‌ శిల్ప కళావేదికలో జరగనున్న స్పర్శ్‌ నైట్‌ సంగీత విభావరి కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక మంచి కార్యక్రమం కోసం తాను స్పర్శ్‌ నైట్‌ పేరుతో నిర్వహిస్తున్న సంగీత విభావరి ద్వారా ఎంతో మందికి ఆత్మీయ స్పర్శను ఇవ్వగలుగుతున్న సంస్థకు దోహదపడుతున్నామనే ఆనందం కలుగుతుందన్నారు.

పుట్టకను ఎంత గౌరవప్రదంగా భావిస్తామో మరణాన్ని కూడా అంతే గర్వంగా భావించాలని సూచించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని స్పర్శ్‌ హాస్పిటల్‌లో ఇదే జరుగుతోందన్నారు. మానవత్వం పరిమళించే స్థలంగా ఆ ప్రాంతాన్ని పిలుచుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమకూరే విరాళంతో ఖాజాగూడలో నిర్మించబోయే 70 పడకల ఆస్పత్రికి కొంతైనా సహాయం అందిస్తామన్నారు.  కార్యక్రమంలో రోటరి క్లబ్‌ ఆఫ్‌ బంజారాహిల్స్‌ అధ్యక్షుడు వివి.రమణ, స్పర్శ్‌ ఆస్పత్రి సీఈవో రాంమోహన్‌రావు, ప్రముఖ పారిశ్రామికవేత్త వరప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టిక్కెట్లు కావాల్సిన వారు ఫోన్‌: 9866652305 నంబర్‌లో సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వార్తలు