అధికారికంగా విమోచన దినోత్సవం జరపాలి

18 Sep, 2019 10:10 IST|Sakshi
మాట్లాడుతున్న లక్ష్మణ్, వేదికపై మురళీధర్‌రావు తదితరులు

గ్రౌండ్‌ లెవల్‌లో టీఆర్‌ఎస్‌ షేక్‌ అవుతోంది: మురళీధర్‌రావు

పటాన్‌చెరులో బీజేపీ జెండా ఎగురవేస్తాం: గడీల శ్రీకాంత్‌గౌడ్‌

సాక్షి, పటాన్‌చెరు: అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని బీజేపీ కొన్నేళ్లుగా పోరాటం చేస్తోందని వక్తలు గుర్తు చేశారు. మంగళవారం పటాన్‌చెరు శివారులోని ఎస్‌వీఆర్‌ గార్డెన్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ సభను బీజేపీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల కోరిక మేరకు తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మజ్లిస్‌ కారణంగా కేసీఆర్‌ తెలంగాణ విమోచనోత్సవాలను అధికారికంగా చేపట్టడం లేదన్నారు. సభకు అధ్యక్షత వహించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు మాట్లాడుతూ పటాన్‌చెరులో తెలంగాణ విమోచన ఉత్సవాల సభ నిర్వహణకు ప్రత్యేక కారణం ఉందన్నారు.

తెలంగాణ విమోచనానికి సర్ధార్‌ వల్లభాబాయ్‌ పటేల్‌ సేనలు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో పటాన్‌చెరు చేరుకోగానే నిజాం రాజు తన సంస్థానాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ లొంగిపోయారని నాటి ఘటనలను వివరించారు. ఇంటింటా జాతీయ జెండా ఎగురవేసేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం అనుమతి ఇస్తామంటోందని, కానీ తాము కోరుకుంటున్నది అది కాదన్నారు. అధికారికంగా అన్ని కార్యాలయాల్లో తెలంగాణా విమోచన దినోత్సవాలు నిర్వహించాలన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అమరవీరుల గౌరవం కోసం, తెలంగాణ ప్రజల కోరికను గుర్తిస్తూ విమోచన దినోత్సవాలను నిర్వహించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

బీజేపీ, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి కనీసం ప్రతిపక్ష పార్టీగా కూడా అర్హత లేదన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణను అప్పుల పాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పాలన సాగిస్తోందని ఆయన విమర్శించారు. అవినీతికి మారు పేరుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మారిపోయిందన్నారు. బీజేపీయే టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలు గుర్తించారని, అందుకే అనేక మంది బీజేపీలో చేరుతున్నారని ఆయన గుర్తు చేవారు. టీఆర్‌ఎస్‌లో లుకలుకలు ప్రారంభమయ్యాయని మరళీధర్‌రావు అన్నారు. గ్రౌండ్‌ లెవల్‌లో ఆ పార్టీ షేక్‌ అవుతోందిని, ఎన్ని మంత్రివర్గ విస్తరణలు చేపట్టినా ఆ పార్టీని కాపాడలేరని ఆయన విశ్లేషించారు.  అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని బీజేపీ నాయకుడు గడీల శ్రీకాంత్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌తోనే పటాన్‌చెరులో తమ పార్టీ రాష్ట్ర కమిటీ సభను ఏర్పాటు చేసిందన్నారు.  బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పటాన్‌చెరులో బీజేపీకి టిక్కెట్‌ వచ్చి ఉంటే ఆ పార్టీ అభ్యర్థి గెలుపొందే వాడినని ఆయన వివరించారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రానుందన్నారు. ‘తమ ఇంట్లోని కుక్కపిల్లను కాపాడుకోలే ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇక రాష్ట్రాన్ని ఏం పాలిస్తుంది’అని శ్రీకాంత్‌గౌడ్‌ ప్రశ్నించారు.

తెలంగాణకు నిజాం నుంచి విముక్తి వచ్చినట్లే కేసీఆర్‌ పాలన నుంచి ఈ ప్రాంత ప్రజలకు విముక్తి లభించనుందన్నారు. బీజేపీ నాయకుడు గరికపాటి రామ్మోహాన్‌రావు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ తెలంగాణ విమోచన దినంపై అధికారంలోకి రాగానే ఆ మాటను విస్మరించారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా విమోచన కమిటీ అధ్యక్షుడు శ్రీవర్ధన్‌రెడ్డి సభకు అధ్యక్షత వహించారు. ఇందులో ఎంపీ సోయం బాబూరావు, మాజీ ఎమ్మెల్సీలు మోహన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పొంగులేటి సుధాకర్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి (మెదక్‌),  విజయపాల్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు, నాయకుడు వివేక్,  జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, అనంత్‌రావు కులకర్ణి, ఆదెల్లి రవీందర్, అంకగల్ల సహాదేవ్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు