ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

11 Jun, 2014 04:21 IST|Sakshi
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

ఆర్మూర్ అర్బన్, : డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించాలని జిల్లా ఉప రవాణా శాఖాధికారి (డీటీసీ) రాజారత్నం సూచించారు. మండలంలోని పెర్కిట్ సిటీ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం ఆర్మూర్ ఎంవీఐ శాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠ శాలల బస్సు డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీటీసీ హాజరై మాట్లాడారు. యాజమాన్యాలు ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న అర్హత గల డ్రైవర్లను నియమించు కోవాలని సూచించారు. ప్రతి డ్రైవర్‌కు హెల్త్ కార్డులను ఏర్పాటు చేసి ప్రతి మూడు నెలలకోసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు.  
 
అలాగే బస్సులో ఫిర్యాదు పుస్తకాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలించే బస్సుల, ఆటోల పర్మిట్లను రద్దు చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించే అంశంపై స్పెషల్ డ్రైవ్‌లను నిర్వహించాలని ఆర్మూర్ ఎంవీఐ అశ్వంత్ కుమార్‌కు సూచించారు. అనంతరం డీఎస్పీ ఆకుల రామ్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలు డ్రైవర్ల చేతిలో ఉంటాయని, అప్రమత్తంగా బస్సులను నడపాలని సూచించారు.
 
ఎంవీఐ అశ్వంత్ కుమార్ మాట్లాడుతూ.. ఎయిడ్స్ మహమ్మారితో ప్రాణాలు కోల్పోతున్న వారికంటే  రోడ్డు ప్రమాదంలోనే అత్యధిక మంది మృత్యువాత పడుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. అనంతరం డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. పాఠశాల యజమానులకు ఎంవీఐ అధికారులు శిక్షణ, పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీభాషిత సుందర్, కాంతి గంగారెడ్డి, వెంకటేశ్ గౌడ్, రాజేశ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు