ఎన్నికల నియమావళి పాటించాలి 

10 Nov, 2018 15:52 IST|Sakshi
మాట్లాడుతున్న అధికారి కె.నర్సింహమూర్తి

ఖర్చుల వివరాలను నెలలోపు కలెక్టర్‌కు సమర్పించాలి 

కె.నర్సింహమూర్తి: రామగుండం అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి 

జ్యోతినగర్‌: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన నియమావళిని తప్పక పాటించాలని, లేనిచో చర్యలు తప్పవని రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కె.నర్సింహమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం రామగుండం ఎన్టీపీసీ టెంపరరీ టౌన్‌షిప్‌లోని ప్రభుత్వ జిల్లా ప్రజా పరిషత్‌ హౌస్కూల్‌ ఆవరణలోని రిటర్నింగ్‌ కార్యాలయ హాలులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమావళి, నామినేషన్‌ సమర్పించే సమయంలో పాటించే నియమ, నిబంధనల గురించి వివరించారు. రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం నుంచి వంద మీటర్ల పరిధిలోకి మూడు వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు. బీ–ఫాం, ఏ–ఫాం అందిస్తేనే పార్టీ చిహ్నం కేటాయిస్తామని స్పష్టం చేశారు. నామినేషన్‌ పత్రంలోని పార్ట్‌–1, 2, 3, 3ఏ, 4, 5, 6, అంశాలను పూర్తిగా చదివిన తర్వాతే దరఖాస్తు పూరించాలని చెప్పారు. 

అలాగే పార్ట్‌–ఏ, బీ ఫాంలోని ఖాళీలను క్షుణ్ణంగా చదువుకుని పూరించాలని, ప్రతీ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని, ఒకవేళ ఖాళీగా ఉంచితే దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అభ్యర్థి నామినేషన్‌ వేసిన నాటి నుంచే అతని ప్రచార ఖర్చు లెక్కింపు జరుగుతుందని వెల్లడించారు. ఎన్నికల కమిషన్‌ నియమావళి ప్రకారం అసెంబ్లీ ఎన్నికల పోటీలో ఉండే అభ్యర్థి రూ.28 లక్షల లోపు ఖర్చు చేసేందుకు అనుమతులు ఉన్నాయన్నారు. ఎన్నికలు ముగిసిన నెలలోపు ఖర్చుల వివరాలను కలెక్టర్‌ కార్యాలయంలో అందించాలని వివరించారు. ప్రచారం ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు చేసుకోవాలని, మైక్‌ మాత్రం ఉదయం 8 నుంచి రాత్రి వరకు తక్కువ ధ్వనితో ప్రచారం చేసుకోవచ్చని అవగాహన కల్పించారు. సమావేశంలో రామగుండం తహశీల్దార్‌ హనుమంతరావు, డిప్యూటీ తహశీల్దార్‌ సురేశ్, ఆర్‌ఐ రాజేంద్రప్రసాద్, వీఆర్‌వోలు అజయ్, మల్లేశం, రాజకీయ పార్టీలకు చెందిన బల్మూరి అమరేందర్‌రావు, జక్కుల నరహరి, మహావాదా రామన్న, రాజేందర్, అశోక్, కోటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థులతోపాటు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు