వాదనలు ముగిసిన 60 రోజుల్లో తీర్పు ఇచ్చి తీరాలి

12 Nov, 2017 00:58 IST|Sakshi

సివిల్‌ కేసుల పరిష్కారం దిశగా హైకోర్టు కీలక తీర్పు

కేసుల పరిష్కారం విషయంలో కిందికోర్టుల తీరుపై ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌: సివిల్‌ కేసుల సత్వర పరిష్కారం దిశగా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసుల పరిష్కారానికి సంబంధించి ఉభయ రాష్ట్రాల్లోని కిందికోర్టులకు, అక్కడి న్యాయవాదులకు దిశానిర్దేశం చేసింది. ముఖ్యంగా సివిల్‌ కేసుల పరిష్కారం విషయం లో కిందికోర్టులు అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కేసులో వాదనలు పూర్తయిన నాటి నుంచి గరిష్టంగా 60 రోజుల్లోపు తీర్పు చెప్పాలని నిబంధనలు స్పష్టం చేస్తుంటే.. కింది కోర్టులు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయని ఆక్షేపించింది. హైకోర్టు ఇచ్చిన సర్క్యులర్లూ అమలుకు నోచుకోవట్లేదంది. అనవసరమైన జాప్యానికి తావిస్తూ.. ఓ పద్ధతంటూ లేకుండా విచారిస్తూ ఏళ్ల తరబడి కేసులు అపరిష్కృతంగా ఉండేందుకు కారణమవుతుండటంపై తీవ్ర అసహనం వెలిబుచ్చింది.

తీర్పు వాయిదా వేశాక కిందికోర్టులు కారణాల్ని వెల్లడించకుండానే కేసులను సుమోటోగా తిరిగి తెరుస్తుండటంపై విస్మయం వ్యక్తపరిచింది. ఈ తీరువల్ల జడ్జీల విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తమయ్యే పరిస్థితి వస్తోందని, ఇకపై పద్ధతి మార్చుకోవాలని, కేసుల విచారణకు, పరిష్కారానికి ఓ నిర్దిష్ట విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. ఉభయపక్షాల న్యాయవాదుల వాదనలు పూర్తయి.. కోర్టుకు ఎలాంటి సందేహాలకు తావులేకుండా స్పష్టత వచ్చేంతవరకు కేసులో తీర్పును రిజర్వ్‌ చేయవద్దని సూచించింది. వాదనలు ముగిసిన 60 రోజుల్లోగా తీర్పు ఇచ్చి తీరాలింది. ఒకసారి తీర్పును రిజర్వ్‌ చేశాక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కేసును సుమోటోగా తిరిగి తెరవడానికి వీల్లే దంది. అసాధారణ పరిస్థితుల్లో తెరవాల్సి వస్తే అందుకు కారణాల్ని వెల్లడిస్తూ.. ఉభయపక్షాలకు నోటీసులివ్వాలంది. ఈ విషయాన్ని ఓ ప్రొఫార్మా రూపంలో జిల్లా ప్రధాన న్యాయాధికారికి తెలియచేయాలని, జిల్లా ప్రధాన న్యాయాధికారి ఈ విషయాల్ని ఎప్పటికప్పుడు హైకోర్టుకు తెలపాలని స్పష్టం చేసింది. ఓ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి గతవారం ఈ తీర్పిచ్చారు.
 
ప్రాథమిక దశలోనే డాక్యుమెంట్లు సమర్పించాలి... 

ఈ సందర్భంగా న్యాయవాదులకూ కొన్ని సూచనలు చేశారు. న్యాయవాదులు జాప్యానికి తావులేకుండా కేసు ప్రాథమిక దశలోనే అన్ని దరఖాస్తుల్ని సమర్పించాలన్నారు. అభ్యర్థనల్ని మెరుగుపరచడం, కేసులో పార్టీల చేర్పు, తొలగింపు తదితర విషయాల్లో న్యాయవాదులు చివరిదశలో దరఖాస్తులు వేస్తున్నారని, దీనివల్ల కేసుల పరిష్కారంలో అసాధారణ జాప్యం జరుగుతోందన్నారు. కోర్టు సైతం ప్రాథమిక విచారణ పూర్తయ్యాక న్యాయవాదులతో మాట్లాడి వాదనలకు ఎంత సమయం పడుతుంది.. ఇంకా సమర్పించాల్సిన వివరాలున్నాయా.. తదితర వివరాలు తెలుసుకుని విచారించే కేసులకు సంబంధించి ఓ ప్రత్యేక జాబితాను రూపొందించాల్సి ఉండగా, ఆ పని చేయట్లేదన్నారు. సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌(సీపీసీ), ఏపీ సివిల్‌ రూల్స్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌ అండ్‌ సర్క్యులర్‌ ఆర్డర్స్‌–1980లోని నిబంధనల్ని కచ్చితంగా పాటించి తీరాలన్నారు. వీటితోపాటు వీటి ఆధారంగా హైకోర్టు జారీచేసిన, చేయబోయే సర్క్యులర్లను కిందికోర్టులు పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు హైకోర్టు పాలనాపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 

ఇదీ కేసు... 
తన ఇంట్లో ఉన్నవారిని ఖాళీ చేయించే విషయంలో విశాఖపట్నం మొదటి అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాలుచేస్తూ భామిడిమర్రి విజయలక్ష్మి అనే మహిళ హైకోర్టులో సివిల్‌ రివిజన్‌ పిటిషన్‌(సీఆర్‌పీ) వేశారు. తాను దాఖలు చేసిన సవరణ పిటిషన్‌ను విశాఖ కోర్టు కొట్టివేయడంపై అభ్యంతరం తెలిపారు. విజయలక్ష్మి పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి ఇటీవల తీర్పు ఇచ్చారు. కిందికోర్టు వాదనలు విని తీర్పును రిజర్వ్‌ చేశాక.. తీర్పును పదేపదే వాయిదా వేసి, మళ్లీ కేసును సుమోటోగా తెరిచి వాదనలు వినడాన్ని న్యాయమూర్తి గమనించారు. ఇలా తీర్పు రిజర్వ్‌ చేశాక మళ్లీ సుమోటోగా కేసును తెరవడం సరికాదని, ఇది అనారోగ్యకరమైన వ్యవహారమని తేల్చారు. అయితే విజయలక్ష్మి వేసిన సవరణ పిటిషన్‌ను కొట్టేస్తూ విశాఖకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని న్యాయమూర్తి సమర్థించారు. ఆమె పిటిషన్‌ను కొట్టేశారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు