అది నీలి కిరోసిన్...

13 Oct, 2014 03:58 IST|Sakshi
  • ముస్తఫా కేసు దర్యాప్తు ముమ్మరం
  •  ఘటనా స్థలాన్ని మళ్లీ పరిశీలించిన ‘సిట్’
  • సాక్షి, సిటీబ్యూరో:  మెహిదీపట్నం మిలటరీ ఏరియాలో కాలిన గాయాలతో మృతి చెందిన ముస్తఫా (11) ఉదంతంపై నగర పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే దర్యాప్తు అధికారులకు ఘటనా స్థలంలో కీలక ఆధారాలు లభించాయి. మరోపక్క ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మిలటరీ ఉన్నతాధికారులు అంతర్గత విచారణను ముమ్మరం చేశారు.

    ఆదివారం ఘటన జరిగిన మిలటరీ సిగ్నల్ ఇక్యూప్‌మెంట్ ఏరియాను నగర సీసీఎస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) పోలీసులతో పాటు మిలటరీ అధికారులు మరోసారి సందర్శించి వివరాలు సేకరించారు. ముస్తఫా హత్యకు గురై ఉంటే అందుకు కార ణాలేమిటి? అనే కోణంలో ఆ ప్రాంతాన్ని  క్షుణ్ణంగా పరిశీలించామని ఓ పోలీసు ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఘటన జరిగిన రోజే డాగ్‌స్క్వాడ్ ముస్తఫా మృతదేహం పడిన చోటి నుంచి మిలటరీ సిగ్నల్ ఇక్యూప్‌మెంట్ కాంపౌండ్ లోపల ధోబీరూమ్ వద్ద ఉన్న బాత్‌రూం వద్దకు (ఇక్కడే ముస్తఫా ఒంటికి మంటలంటుకున్నాయి) వెళ్లింది.

    బాత్‌రూం నుంచి ముస్తఫా పడిన చోటికి, అక్కడి నుంచి బాత్‌రూమ్ వరకు ఇలా ఐదుసార్లు పోలీసు శునకం వెళ్లొచ్చింది. అది మరోచోటికి వెళ్లకుండా ముస్తఫా వద్దకే వచ్చి ఆగిందంటే ఘటన ప్రారంభమైన ప్రాంతంలో మరో వ్యక్తి ఉన్నాడా?.. ఉంటే అతను పారిపోయి ఉంటే అటు వైపు డాగ్ ఎందుకు వెళ్లలేదు. అనే ప్రశ్నలు పో లీసులను వేధిస్తున్నాయి.
     
    బయట నుంచే కిరోసిన్ తెచ్చారా?

    ముస్తఫా ఒంటిపై పడింది బ్లూ కిరోసినేనని దర్యాప్తు అధికారులు నిర్థారించారు. ఈ విషయాన్ని మిలటరీ అధికారులూ గుర్తించారు. క్లూస్ టీం కూడా ఘటన జరిగిన సమయంలో ధోబీరూమ్ పక్కనే బాత్‌రూమ్ ముందు పడిఉన్న (అర లీటర్ ఖాళీ మజా ప్లాస్టిక్)బాటిల్‌లో ఉన్న నీలి రంగు కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కిరోసిన్‌ను ఫోరెన్సీక్ ల్యాబ్‌కు కూడా పంపిచారు. అయితే ఈ కిరోసిన్ ఘటనా స్థలానికి ఎలా వచ్చింది? అనే దానిపై ఆరా తీస్తున్నారు. తెల్ల కిరోసిన్ అయితే ఎక్కడపడితే అక్కడ లభిస్తుంది. అదే నీలి రంగు  (ప్రభుత్వం దీన్ని సబ్సిడీపై రేషన్‌షాపుల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తోంది) కిరోసిన్. మిలటరీ సిబ్బందికి ఈ  కిరోసిన్ సరఫరా కానేకాదు.  

    వారి క్వార్టర్స్‌లో కూడా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లే ఉన్నాయి. ఇక సైనికుల దుస్తులు ఇస్తిరీ చేసే ధోబీరూమ్‌లో కూడా ఎక్కడా కిరోసిన్ ఉన్న దాఖలాలు లేవు. బొగ్గుల పెట్టేతో ఇస్తిరీ చేస్తే బొగ్గులకు నిప్పంటించేందుకు కిరోసిన్ వాడతారు. అయితే ఇక్కడ కరెంట్ పెట్టెతో ఇస్తిరీ చేస్తున్నారు కాబట్టి కిరోసిన్ అవసరం లేదు. అలాగే ధోబీ రూమ్ చుట్టుపక్కల ఎక్కడా బొగ్గులు కాని, కాలిన బొగ్గు బూడిద కాని కనిపించలేదు. అలాగే  మిలటరీ సిగ్నల్ ఇక్యూప్‌మెంట్ కాంపౌండ్‌లోని ఐదు గదులను కూడా మిలటరీ అధికారుల సహకారంతో పోలీసులు తనిఖీ చేశారు.

    ఆ గదులలో కూడా ఎక్కడా కిరోసిన్ పెట్టిన ఆనవాళ్లు లేవు. దీంతో ఈ నీలిరంగు కిరోసిన్ మిలటరీ ఏరియాకు బయటి నుంచే వచ్చి ఉంటుందని పోలీసుల భావిస్తున్నారు. కిరోసిన్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెడితే ముస్తఫా మృతిపై మిస్టరీ వీడే అవకాశం ఉందంటున్నారు.  ఘటన స్థలంలో కాలిపోయిన చిన్నపాటి చెట్ల ఆకులతో పాటు కిరోసిన్ పడిన ఆకులను కూడా ఫొరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ఆ ఆకులపై పడింది కూడా నీలిరంగు కిరోసినేనని తేలింది.
     

మరిన్ని వార్తలు