ముస్తఫాపై లైంగిక దాడి జరగలేదు

2 Nov, 2014 00:21 IST|Sakshi
 • తేల్చిన ఫోరెన్సిక్ నివేదిక
 • సాక్షి, సిటీబ్యూరో: మెహిదీపట్నం మిలటరీ ఏరియాలో కాలిన గాయాలకు గురై మృతి చెందిన ముస్తఫా (11)పై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అధికారులకు శనివారం ఒక నివేదిక అందింది. ముస్తఫా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా మార్చురీ వైద్యులను సైతం సిట్ బృందం విచారించింది. వారు కొన్ని కీలక అంశాలను వెల్లడించినట్లు తెలిసింది. అందులో ముస్తఫాపై లైంగిక దాడి జరగలేదని తేలింది.

  ఈ నెల 8న మిలటరీ ఎక్యుప్‌మెంట్ ఏరియాలో ముస్తఫా కాలిన గాయాలకు గురై  మరుసటి రోజు చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఉదంతంపై ముస్తఫా మరణవాంగ్మూలం మేరకు  గుర్తు తెలియని ఆర్మీ సిబ్బందిపై హుమాయున్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

  సున్నితమైన అంశాలతో ముడిపడి ఉన్న ఈ కేసును నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో కేసులో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఇద్దరు ఐపీఎస్ అధికారులతో కూడి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను పక్షం రోజుల క్రితం ఏర్పాటు చేశారు. సిట్ బృందం ఇప్పటికే ఎనిమిది మంది మిలటరీ జవాన్లను, చుట్టుపక్కల ఉన్న దుకాణాల యజమానులను విచారించింది.
   
  అగ్గిపెట్టెను ముస్తఫానే ఖరీదు చేశాడు..

  ఘటనకు ముందు ముస్తఫా స్వయంగా తన దుకాణానికి వచ్చి రెండు అగ్గిపెట్టెలు, రెండు చాక్లెట్లు ఖరీదు చేశాడని ఓ దుకాణ యజమానురాలు సిట్ అధికారులకు తెలిపింది. ఆ సమయంలో ముస్తఫా ఒక్కడే దుకాణానికి వచ్చాడని, తన దుకాణానికి వచ్చిన 15 నిముషాలకే ఈ ఘటన చోటుచేసుకుందని ఆమె వెల్లడించింది. అయితే నీలి కిరోసిన్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం నేటికి తెలియరాలేదు. సిద్ధికీనగర్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న కాలనీల్లో బ్లూ కిరోసిన్ విక్రయించే కిరాణా షాప్ యజమానులను సైతం పోలీసులు విచారించినా ఫలితం దక్కలేదు. బ్లూ కిరోసిన్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం తులిస్తే కేసు కొలిక్కి వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా