రియల్‌ హీరోలు

4 May, 2019 07:06 IST|Sakshi
మాట్లాడుతున్న నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ ఉత్తమ ఆటో డ్రైవర్లను సత్కరిస్తున్న సీపీ

ఆటో డ్రైవర్లకు సీపీ అంజనీకుమార్‌ కితాబు

ఉత్తమ ఆటో డ్రైవర్లకు సత్కారం

‘మై ఆటో ఈజ్‌ సేఫ్‌’ ఆధారంగా ఎంపిక

కవాడిగూడ: ప్రతి ప్రయాణికుడికి భరోసా, భద్రత కల్పిస్తూ సురక్షితంగా గమ్యానికి చేరుస్తున్న ఆటో డ్రైవర్లు నిజమైన హీరోలని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ అన్నారు. శుక్రవారం కవాడిగూడ డివిజన్‌ పరిధిలోని పింగళి రాంరెడ్డి హాల్‌లో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఉత్తమ డ్రైవర్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ మాట్లాడుతూ ‘మై ఆటో ఈజ్‌ సేఫ్‌’ ఆధారంగా ఆటో డ్రైవర్ల పట్ల ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నగరంలో ఏడుగురు ఉత్తమ డ్రైవర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ డ్రైవర్లుగా ఎంపికైన ఖలీల్, నారాయణ, శంకర్, నవీన్, మోతియా, లింగయ్య, భిక్షమయ్యలను సీపీ ఘనంగా  సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మూడు నెలల క్రితం ప్రయాణికుల కోసం ప్రారంభించిన ‘మై ఆటో ఈజ్‌ సేఫ్‌’ కార్యక్రమం సత్ఫలితాలు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు సహకారం, సమన్వయంతోనే ఇది సాధ్యమైందన్నారు.

నగరంలో ఇప్పటి వరకు 35 వేల ఆటోలు ‘ మై ఆటో ఈజ్‌ సేఫ్‌’ లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయన్నారు. ఈ మూడు నెలల వ్యవధిలో ప్రయాణికుల్లో  ఒకరు రూ. 25 వేల నగదు, ఒక విద్యార్థి హాల్‌టికెట్‌ మరిచిపోవడం, మెడికల్‌ సర్టిఫికెట్లను ఆటోలో మరిచిపోయారన్నారు. అయితే ఆటోకు ఉన్న స్టిక్కర్‌ను ఫొటో తీసుకున్నందున దానిపై ఉన్న నంబర్‌కు ఫోన్‌ చేసిన వెంటనే ఆటో డ్రైవర్‌ మరిచిపోయిన వస్తువులను తిరిగి ఇచ్చారన్నారు. తద్వారా ప్రయాణికులకు ఆటో డ్రైవర్లపై విశ్వాసం, నమ్మకం పెరిగాయన్నారు. గ్రేటర్‌ పరిధిలో మహిళా భద్రత, రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. నగరంలో 75 వేల మంది పోలీసు సిబ్బంది ఇందుకు నిరంతరం కృషి చేస్తున్నారని, మండే ఎండలో సైతం ట్రాఫిక్‌ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. మొదటి సారి నిర్వహించిన ఉత్తమ ఆటో డ్రైవర్ల కార్యక్రమంలో ఏడుగురు మాత్రమే సత్కారం పొందారని, త్వరలో 100 మంది ఉత్తమ ఆటో డ్రైవర్లుగా ఎంపిక కావాలని కోరారు. దేశంలోనే తెలంగాణకు మంచి పేరు, ప్రతిష్టలు ఉన్నాయని, దీనికి మరింత పెంచేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌ అనిల్‌ కుమార్, డీసీపీ ఎల్‌.ఎస్, చౌహాన్, అడిషనల్‌ డీసీపీ భాస్కర్, కరుణాకర్, ఏసీపీలు శ్రీనివాస్‌రెడ్డి, కోటేశ్వరరావు, సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఐఎఫ్‌టీయూ ఆటో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కిరణ్, అన్న ఆటో యూనియన్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాసరి నరేష్, ఆటో డ్రైవర్లు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు