మా బిడ్డ సీఎం అవుతుండు

31 May, 2014 23:44 IST|Sakshi
మా బిడ్డ సీఎం అవుతుండు

ఆనందంలో చింతమడక గ్రామస్తులు
 సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్: చింతమడక... ఒకప్పడు ఈ పేరు కేవలం పొరుగున ఉన్న నాలుగు గ్రామాలకే సుపరిచితం. కానీ నేడు అది యావత్ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన ధన్యస్థలంగా ప్రతీతి పొందుతోంది. చింతమడక ముద్దు బిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు  తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఆ గ్రామ వాసులంతా ఆ అపురూప క్షణాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బాల్యం తమతో కలిసి ఆడిపాడిన దోస్త్  రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతుండడంతో కేసీఆర్ బాల్యమిత్రులు ఆన ందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు.
 
 ‘ప్రత్యేక’ పోరాటంలో ఆ పల్లె ప్రత్యేకం
 తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో అందరినీ ఏకం చేసి ఆకాంక్ష నెరవేర్చిన కేసీఆర్ స్వగ్రామం చింతమడక తెలంగాణలోని పది జిల్లాలకు స్ఫూర్తిగా నిలిచింది. 2001లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా గులాబీ జెండాను భుజానికెత్తుకున్న కేసీఆర్, ప్రత్యేక రాష్ట్రం సాధించడంతో పాటు అధికార పగ్గాలు కూడా చేపట్టనుండడంతో  ఆయన స్వగ్రామంలోని ప్రతి గడపా పులకిస్తోంది.
 
 చరిత్రలో సుస్థిరంగా నిలిచిన ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్‌కు జన్మనిచ్చిన ఆ గ్రామం నేడు ఆనంద పరవశంతో ఓలలాడుతోంది. జూన్ 2న కేసీఆర్ అధికారం చేపట్టనున్న నేపథ్యంలో ఆయన స్వగ్రామం చింతమడకలోని కొందరిని ‘న్యూస్‌లైన్’ పలుకరించగా, సీఎం మా వాడేనంటూ గంతులేశారు. మా దోస్త్ తప్పకుండా మంచి సీఎం అవుతాడంటూ కితాబిచ్చారు.
 
 ఎంతో గర్వంగా ఉంది..
 చింతమడక బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కావడం ఎంతో గర్వంగా ఉంది. ఆయన బాల్యం నుంచే మొండి పట్టుదల. అనుకున్నది సాధించే వరకు వదలడు.  రాజకీయాల్లో కూడా పట్టు విడుపులేని వ్యక్తి. మా ఊరి నాయకుడు రాష్ట్ర నాయకుడు అవుతున్నాడంటే సంతోషంగా ఉంది.
 - సత్యనారాయణగౌడ్, మాజీ సర్పంచ్
 
 మా ఊరి పేరు అందరికి తెలిసింది
 మొన్నటి దాకా సిద్దిపేట మండలానికి, జిల్లాకు తెలిసిన మా ఊరి పేరు నేడు దేశ వ్యాప్తంగా తెలిసింది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రజలకు మరింత సేవలు చేసి ఊరిని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి.
 - కూస బాల్‌రాజు, గ్రామ నాయకుడు
 
 సీఎం మాఊరోడని చెప్పుకుంటాం
  ముఖ్యమంత్రి కేసీఆర్ మాఊరోడేనని గర్వంగా చెప్పుకుంటాం. ఇక చింతమడకపై అందరూ దృష్టి పెడతారు. తప్పకుండా గ్రామం అభివృద్ధి చెందుతుంది.
 - చెప్యాల దేవవ్వ, ఎంపీటీసీ
 

మరిన్ని వార్తలు