నా మొదటి ఎన్నికలో రూ.10 వేలు కూడా ఖర్చుకాలే..!

13 Nov, 2018 14:46 IST|Sakshi
మాట్లాడుతున్న కమతం రాంరెడ్డి

అవి కూడా గోడలమీద రాతలకు, బ్యానర్లకు,బ్యాలెట్‌ పేపర్లకే..

ప్రచారానికి వెళ్తే.. గ్రామ నాయకులే  భోజనం పెట్టి పంపేవారు

అప్పట్లో.. ఖర్చులేని.. అవినీతి రహిత రాజకీయాలు

నేడు అభ్యర్థులు రూ.కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు 

ఇప్పుడు విలువలు చెప్పేవారు లేరు.. పాటించేవారు లేరు..

మాజీ మంత్రి కమతం రాంరెడ్డి

‘నాడు విలువలతో కూడిన రాజకీయం చేసే వారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ అలాగే ఉండేవారు. 1980 వరకు ఆ పరిస్థితి ఉంది. ఆ తర్వాత రాజకీయాలు మారుతూ వచ్చాయి. నేడు విలువల గురించి చెప్పే వారు లేరు.. చెప్పినా వినేవారు లేరు.. పాటించే వారు అంతకన్నా లేరు’ అని మాజీ మంత్రి కమతం రాంరెడ్డి అన్నారు. డబ్బులు లేకుండా రాజకీయమంటే నేడు వింతగా చూసే పరిస్థితి వచ్చిందని,  డబ్బుతోనే అంతా ముడిపడి ఉందని అన్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’ ఆయనను పలకరించగా.. రాజకీయాల్లో, ప్రజల్లో వచ్చిన మార్పులను.. తన అనుభవాలను వివరించారు.

సాక్షి, పరిగి: నేడు రాజకీయాలను, డబ్బును వేర్వేరుగా చూడలేము. ఇప్పుడు డబ్బు లేకుండా రాజకీయాల్లోకి రావటాన్ని కనీసం ఊహించలేం. ఎమ్మెల్యేగా గెలవాలంటే కనీసం రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ చెబుతున్న  రూ.28 లక్షలు కొన్ని చోట్ల సర్పంచ్‌ ఎన్నికల్లో కూడా వెచ్చిస్తున్నారు. ఇలా ఎన్నికల్లో ఓట్ల కోసం వెచ్చిస్తున్న డబ్బులు మళ్లీ వారి నుంచే సంపాదించాలిగా.. నేడు నేతలెవరైనా ఆస్తులు అమ్ముకుని ప్రజా సేవ చేస్తున్నారా.. అప్పట్లో రాజకీయాలన్నీ కాస్ట్‌ లెస్‌.. కరప్షన్‌ లెస్‌ అన్న తరహాలో ఉండేవి. ఇప్పుడు కనీసం అది ఊహల్లోనైనా జరుగుతుందా. నేను మొదటి సారిగా 1967లో ఎమ్మెల్యేగా పోటీచేశాను. అప్పట్లో  కేవలం రూ.10 వేల లోపే ఖర్చు చేశాను. అవి కూడా డబ్బుల రూపంలో నయా పైసా కూడా ఎవరికీ ఇవ్వలేదు. గోడల మీద రాతలు, బ్యానర్లు, గుర్తు చూపించేందుకు బ్యాలెట్‌ పేపర్లు తదితర వాటికి ఖర్చు చేశాం. 1980 సంవత్సరం వరకు టీ తాపటం వరకే ఖర్చులుండేవి.

నేడు వ్యక్తిగత కోర్కెలే..
ఆ రోజుల్లో ప్రచారానికి గ్రామంలోకి వెళ్లగానే ఎంతో ఆప్యాయతతో ప్రజలు పలకరించేవారు. గ్రామ నాయకులు ఎదురు వచ్చి స్వాగతం పలికేవారు. ఒక్కరు కూడా వ్యక్తిగతంగా నాకిది కావాలని అడిగేవారు కాదు. గ్రామంలో స్కూల్, కరంటు, మంచి నీల్లు, రోడ్డు కావాలని ఇలా  సామాజిక సమస్యలే అడిగేవారు. ఒకరిద్దరికి కలిసి వచ్చేవాళ్లం. వారే గ్రామంలో అందరికి చెప్పి ఓట్లు వేయించే వారు. ఇప్పుడు నేతలు, కార్యకర్తలు ఇలా ఎవరు చూసినా వ్యక్తిగత కోర్కెలతో ఓ పార్టీని విడిచి మరో పార్టీలో చేరుతున్నారు. రాయితీ ట్రాక్టర్‌ కోసం ఒకరు.. నామినేటెడ్‌ పదవి కోసం మరొకరు..ఆర్థిక లాభాల కోసం ఒకరు చర్చలు జరిపి పార్టీలు మారుతున్నారు.

భోజనాలు గ్రామ నాయకులే ఏర్పాటు చేసేవారు..
మా రోజుల్లో ఏ గ్రామానికి ప్రచారానికి వెళ్లినా.. గెలిచాక గ్రామానికి అభివద్ధి పనుల పర్యవేక్షణకు వెళ్లినా ఆ గ్రామంలో ఉండే నాయకులే భోజనాలు ప్రేమతో ఇళ్లలో వండి పెట్టేవారు. నేడు వెంట తిరిగే కార్యకర్తల కోసం నాయకులు రోజూ లక్షలు ఖర్చు చేస్తున్నారు. బీరు.. బిర్యాని అంటూ మద్యం ఏరులై పారిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రచారంలో పాల్గొనే వారికి రోజు కూలీ కూడా ఇస్తున్నారు.

పట్టాదారు పాసుపుస్తకాలు నా హయాంలోనే ఇచ్చాం..
రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రైతులకు భూమి హ క్కులకు సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలను నేను రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు అందజేశాం. 1992లోనే పాసుపుస్తకాలు ముద్రించటం పూర్తయిన ప్పటికీ ఎన్నికల కోడ్‌ అంటూ చంద్రబాబు ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని ఇవ్వకుండా అడ్డుకున్నా డు. మళ్లీ ఎన్నికలయ్యాక 1994లో మేమే ఇచ్చాం. ఆ తరువాత చాలా  రాష్ట్రాలు మనల్ని ఆదర్శంగా తీసుకుని పట్టాదారు పాసుపుస్తకాలు ముద్రించి ఇచ్చాయి.

ఒక్కటి తప్ప అన్నీ చేశాను..
రాష్ట్రంలోనే అట్టడుగున ఉన్న పరిగి నియోజకవర్గా న్ని ముందువరుసలో నిలబెట్టాను. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా ని యోజకర్గానికి చేసినంత.. ఆయన సొంత నియోజకవర్గానికి కూడా చేసుకోలేదు. లఖ్నాపూర్, సాలార్‌నగర్‌ సాగు నీటి ప్రాజెక్టులు.. అంతారం, ఇప్పాయిపల్లి చెరవులు నా హయాంలోనే నిర్మించాం. పరిగిలో బస్‌డిపో,  వ్యవసాయ మార్కెట్, పాలశీతలీకరణ కేంద్రం, కుల్కచర్లలో డిగ్రీ కళాశాల, ఇలా పెద్ద పెద్ద పనులన్నీ నేనే చేయించాను. నియోజకవర్గంలో ప్రతి తండాకు కరంటు, ప్రతి గ్రామానికి రోడ్లు వే యించాను. కోయిల్‌సాగర్‌ నుంచి గానీ కృష్ణా నది నుంచి నేరుగా గానీ సాగు నీరు తేవాలని అనుకున్నాను. కానీ, అదొక్కటి చేయలేకపోయాను.

 వైఎస్‌ డైనమిక్‌ లీడర్‌.. వాజ్‌పేయి ఇష్టమైన నాయకుడు

ఇప్పుడు అనుకోని పరిస్థితిలో బీజేపీలో ఉన్నాను. కానీ, నేను మొదట్నుంచి కాంగ్రెస్‌ వాదినే. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంచి మనసున్న డైనమిక్‌ లీడర్‌. పీవీ నర్సింహారావు, కోట్ల విజయభాస్కర్‌రెడ్డిలు మంచి నాయకులు. కాంగ్రెస్‌ వాదినైనప్పటికీ జాతీయ రాజకీయాల్లో నాకు వ్యక్తిగతంగా వాజ్‌పేయి అంటే బాగా నచ్చుతుంది. కేసీఆర్‌ తెచ్చిన రైతు బంధు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతు బీమా  పథకాలు బాగున్నాయి.

మరిన్ని వార్తలు