విద్యార్థినిపై మ్యాట్రిన్‌ దాష్టీకం

27 Mar, 2017 04:02 IST|Sakshi

చిన్నారిని కొట్టి... తోటి విద్యార్థినులతో కొట్టించిన వైనం

నేలకొండపల్లి(పాలేరు): మేడమ్‌ ఇంటికి ఎందుకు వెళ్తున్నారంటూ తోటి విద్యార్థినులను అడిగిన పాపానికి వసతి గృహ సంక్షేమాధికారిణి(మ్యాట్రిన్‌) చిన్నారిని తొడ కందిపోయేలా పిండి, తీవ్రంగా కొట్టి, రెండు గంటలపాటు నిలబెట్టింది. అదీచాలక విద్యార్థినులతో కూడా చెంప దెబ్బలు కొట్టించింది. ఆమె దాష్టీకానికి తట్టుకోలేక చిన్నారి అల్లాడిపోయింది. ఆమె భర్త కూడా హాస్టల్‌కు వచ్చి అసభ్య పదజాలంతో తిట్ల దండకం అందుకున్న ఘటన శనివారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో జరిగింది.

నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లి కొత్తూరు కు చెందిన కందగట్ల నందిని నేలకొండపల్లిలోని బీసీ బాలికల వసతి గృహంలో మూడో తరగతి చదువుతోంది. అయితే హాస్టల్‌లో ఉండే విద్యార్థినులు రోజూ మాట్రిన్‌ ఇంట్లో పని చేసేందుకు వెళ్తున్నారు. ‘రోజూ మేడమ్‌ ఇంటికి ఎందుకు వెళ్తున్నారు’ అని నందిని అమాయకంగా వారిని అడిగింది. ఈ విషయాన్ని కొందరు విద్యార్థినులు మ్యాట్రిన్‌కు చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఆమె నందినిపై దాష్టీకానికి దిగింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆదివారం హాస్టల్‌కు వచ్చి నందినిని ఇంటికి తీసుకెళ్లారు. చిన్నారిని హింసించిన సంక్షేమాధికారిణి, ఆమె భర్తపై చర్య తీసుకోవాలని రజక, బీసీ సంక్షేమ సంఘాలు డిమాండ్‌ చేశాయి. కాగా, ఈ ఘటనపై తమకు సమాచారం లేదని, హాస్టల్‌కి వెళ్లి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని జిల్లా బీసీ వెల్ఫేర్‌ అధికారి హృషికేష్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు