బొగ్గుల కుంపటి కొంపముంచిందా?

24 Dec, 2017 02:24 IST|Sakshi

ఏడుగురి మరణాల వెనుక వీడని మిస్టరీ

పోస్టుమార్టం నివేదికలోనూ తెలియని కారణం?

శరీర అవయవాల శాంపిల్స్‌ సేకరణ

గదిలో బొగ్గుల కుంపటిని గుర్తించిన పోలీసులు

రాజాపేట (ఆలేరు): యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట శివారులోని పౌల్ట్రీఫాంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మరణం చిక్కుముడి వీడటం లేదు. వీరు తిన్న ఆహారం కలుషితమైందా.. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడ్డారా..? ఎవరైనా హత్య చేశారా..? అన్నది ఇంకా తేలడం లేదు. అయితే.. బొగ్గుల కుంపటి వీరి ప్రాణాలు తీసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాజాపేటలోని పౌల్ట్రీఫాంలో సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం మునిగడపకు చెందిన దుబ్బాసి బాలరాజు (44), నిర్మల(40), వారి కుమార్తె శ్రావణి(14), చింటు(12), బన్ని(8), అత్తమామలైన జనగామ జిల్లా చిలుపూరు మండలం లింగంపల్లికి చెందిన బచ్చలి బాలనర్సయ్య(68), బచ్చలి భారతమ్మ(60) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ మరణాల మిస్టరీ ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.
 
బొగ్గుల కుంపటే కారణమా?
బాలరాజు కుటుంబ సభ్యులు గురువారం రాత్రి భోజనాలు ముగించుకుని నిద్రకు ఉపక్రమించారు. రాత్రి బాగా చలిగా ఉండటంతో పౌల్ట్రీఫాంలో కోడిపిల్లలకు వెచ్చదనం కోసం ఉపయోగించే బొగ్గుల కుంపటిని వేడి కోసం వారు పడుకునే గదిలో పెట్టుకున్నారు. అసలే చిన్నగది. గాలి చొరబడకుండా దానికి ఉన్న కిటికీని, తలుపులు బిగించి నిద్రించారు. గదిలో ఉన్న బొగ్గుల కుంపటి వల్ల కార్బన్‌ డయాక్సైడ్, కార్బన్‌ మోనాక్సైడ్‌ ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. దీంతో గదిలో ఉన్నవారికి ఊపిరాడక కుటుంబ సభ్యులంతా నిద్రలోనే విగత జీవులై ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

పురుగు మందు వీరు తెచ్చుకున్నది కాదు
పురుగు మందు కూడా వీరు తెచ్చుకున్నది కాదని తెలుస్తోంది. పక్క గదిలో దొరికిన క్రిమి సంహారక మందులు కాకల్ల ఐలయ్య పత్తి చేను కోసం తెచ్చుకున్నట్లు పౌల్ట్రీయజమాని చెప్పడం చూస్తుంటే బొగ్గుల కుంపటే కారణమన్న దానికి మరింత బలం చేకూరుస్తోంది.


పోస్టుమార్టం నివేదికలోనూ తెలియని కారణం?
పోస్టుమార్టం నివేదికలోనూ వీరి మరణానికి గల కారణాలు పూర్తి స్థాయిలో లభించలేదని విశ్వసనీయ సమాచారం. మృతుల శరీరాల నుంచి షాంపిల్స్‌ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు తెలుస్తోంది. పోలీసులు శనివారం కూడా పౌల్ట్రీఫాం వద్ద మరికొన్ని ఆధారాల కోసం ప్రయత్నించారు. ఏది ఏమైనా ఒకే కుటంబానికి చెందిన ఏడుగురి మరణం మిస్టరీగా మారింది. శరీరం నుంచి సేకరించిన షాంపిల్స్‌ నివేదిక వచ్చాకగానీ కేసు చిక్కుముడి వీడే పరిస్థితి కనిపించడం లేదు. 

మరిన్ని వార్తలు