చెన్నయ్యది హత్యే

21 Feb, 2018 15:36 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సీఐ తిరుపతి రాజు

హతుడు రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి

ఎకరం భూమి కోసం చిన్నాన్నను చంపి ఘాతుకం

నిందితుడు మృతుడి అన్న కొడుకే

అనుమానాస్పద కేసు నుంచి హత్య కేసుగా మార్పు

ఈ నెల 2న జోగిపేటలో సంఘటన

వివరాలు వెల్లడించిన జోగిపేట సీఐ తిరుపతిరాజు

జోగిపేట(అందోల్‌): డాకూరు చెందిన రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి గంగమొల్ల చెన్నయ్య(65)ది హత్యేనని జోగిపేట సీఐ తిరుపతి రాజు తెలిపారు.  మంగళవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ పరమేశ్వర్, రమణలతో కలిసి వివరాలు వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు సీఐ కథనం మేరకు ఇలా ఉన్నాయి. ఎకరం భూమి కోసం స్వంత చిన్నాన్ననే హత్య చేసిన సంఘటన ఈ నెల 2న జరిగింది. డాకూరు గ్రామానికి చెందిన చెన్నయ్య కొంత కాలంగా జోగిపేటలోని కూరగాయల మార్కెట్‌లో గది కిరాయికి తీసుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.

ఆయన స్వగ్రామం మండల పరిధిలోని డాకూరు. చెన్నయ్య, లక్ష్మయ్యలు అన్నదమ్ములు. వీరు భూముల పంపకాల తర్వాత ఎకరం భూమిని వీరి బావమరిది బాలయ్యపేర రాసి ఇవ్వాల్సి ఉంది. కానీ లక్ష్మయ్య తన కొడుకు గంగమోల్ల బాలయ్య(కేసులో నిందితుడు) పేర రాశాడు. అయితే కొంత కాలంగా చెన్నయ్య ఎకరం పొలాన్ని బావమరిది బాలయ్య కూతురు శృతి పేర రాయాలని నిందితుడైన బాలయ్యపై ఒత్తిడి తెచ్చాడు. అయితే ఆ భూమి మీదుగానే ఫోర్‌లైన్‌ బైపాస్‌ రోడ్డు ఏర్పాటవుతుండడంతో భూమి విలువ పెరుగుతుందని బాలయ్య భావించినట్లుగా పోలీసులు తెలిపారు. ఎకరం భూమి కోసం వేధిస్తున్న చిన్నాన్నను అంతమొందిస్తే తనకు అడ్డు ఉండదని నిందితుడు భావించాడు. ఈ క్రమంలో చెన్నయ్య నివాసం ఉండే గదికి వెళ్లి ఒక చేత్తో నోరు మూసి, మరో చేత్తో గొంతు నులిమి హత్య చేసినట్లు సీఐ వివరించారు. పోస్టుమార్టం రిపోర్టులో కూడా గొంతు నులిమి చంపినట్లు తేలిందని చెప్పారు. మొదట్లో చెన్నయ్య మరణానికి సంబంధించి అనుమానాస్పద స్థితిలో మరణించినట్లుగా కేసు నమోదు చేశారు.

అనుమానంతో బాలయ్య, శ్రీనివాస్, మరియమ్మ, దుర్గయ్యల విచారించగా బాలయ్య ఒక్కడే హత్య చేసినట్లుగా రుజువైందని, అతడిపై హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మంగళవారం రిమాండ్‌కు పంపుతున్నట్లు చెప్పారు. నిందితులను చూపెట్టవద్దని ఉత్తర్వులువివిధ కేసుల్లో నిందితులను విలేకరుల ఎదుట ప్రవేశపెట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నట్లు సీఐ తిరుపతి రాజు తెలిపారు. ఈ రోజే దీనికి సంబంధించి పోలీసు శాఖ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారమే హత్య కేసులోని నిందితుడిని ప్రవేశ పెట్టడం లేదని సీఐ చెప్పారు.

మరిన్ని వార్తలు