ఆరోగ్య సిబ్బందికి ఎన్‌–95 మాస్కులు, పీపీఈ కిట్‌లు: కిషన్‌రెడ్డి

6 May, 2020 04:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనాపై పోరులో భాగంగా వైద్య సిబ్బందికి కీలకమైన ఎన్‌–95 మాస్కులు, పీపీఈ (పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌) కిట్‌ల ఉత్పత్తి పెరిగింది. గత మార్చికి, ఇప్పటికి దేశీయంగా తయారవుతున్న ఈ ఉత్పత్తులు మూడింతలు పెరిగాయి. ఈ విషయాన్ని కేం ద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ‘దేశం లో కరోనా కేసులు పెరుగుతుండటంతో రోగులకు చికిత్స అందించడానికి ఎన్‌–95 మాస్కులు, పీపీఈ అవసరం పెరిగింది. దీనిపై పలు రాష్ట్రాల్లో వైద్యులు ఆందోళన కూడా వ్యక్తంచేశారు. మార్చి 30వ తేదీన అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఒక రోజుకు 68,350 ఎన్‌–95 మాస్కులు, 3,312 పీపీఈ కిట్‌లు మాత్రమే ఉత్పత్తి చేయగలిగేవాళ్లం. కానీ, ఏప్రిల్‌ 30నాటికి పరిస్థితి పూర్తిగా మారింది. ఇపుడు రోజుకు 2,30,500 ఎన్‌–95 మాస్కులు, 1,86,472 పీపీఈ కిట్లు ఉత్పత్తి చేస్తున్నాం’ అని వివరించారు. వీటిని కరోనా విధుల్లో ఉన్న ఆరోగ్య సిబ్బందికి అందజేస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు