సింగరేణి సీఎండీగా కలెక్టర్ శ్రీధర్!

29 Dec, 2014 23:46 IST|Sakshi
సింగరేణి సీఎండీగా కలెక్టర్ శ్రీధర్!

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా కలె క్టర్ నడిమట్ల శ్రీధర్ అతి త్వరలో బదిలీ కానున్నారు. ప్రతిష్టాత్మక సింగరేణి కాలరీస్ కంపెనీ సీఎండీగా ఆయన నియామకానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ అంద జేసింది. ప్రస్తుతం కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న శ్రీధర్ ఈ పోస్టును చేపడుతున్న అతి పిన్న వయస్కుడు.

ఈ పదవిలో కొనసాగిన సుదీర్థ భట్టాచార్య ఇటీవల కోల్ ఇండియా కార్పొరేషన్ చైర్మన్‌గా వెళ్లడంతో ఈ పోస్టు ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో శ్రీధర్ పేరును పరిశీలించిన రాష్ట్ర సర్కారు.. కేంద్రానికి ఈయన పేరును సిఫార్సు చేసింది. దీనికి కేంద్రం ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. దేశంలోనే బొగ్గు ఉత్పత్తిలో ప్రసిద్ధిగాంచిన సంస్థల్లో ఒకటైన సింగరేణి సీఎండీ పోస్టుకు ఐఏఎస్ వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ ఏర్పాటు అనంతరం జిల్లా కలెక్టర్‌గా నియమితులైన శ్రీధర్ సమర్థ అధికారిగా పేరు తెచ్చుకున్నారు.

పరిశ్రమల స్థాపన, భూముల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ విధానపర నిర్ణయాల్లో కీలక భూమిక వహిస్తున్నారు. కాగా, అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారుల విభజన ప్రక్రియకు ప్రధాని ఆమోదం తెలిపిన తరుణంలో రాష్ట్రంలో పెద్దఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కలుగనుంది. ఈ బదిలీల పర్వంలోనే  జిల్లా కలెక్టర్ శ్రీధర్ కూడా సింగరేణి సీఎండీగా వెళ్లవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇదిలావుండగా, కలెక్టర్  మార్పిడి తప్పనిసరి అనే వార్తల నేపథ్యంలో కొత్త కలెక్టర్ ఎవరనేది చర్చనీయాంశమైంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు