నయీమ్‌ కంపెనీలో ఖాకీలు!

3 Feb, 2017 01:35 IST|Sakshi
నయీమ్‌ కంపెనీలో ఖాకీలు!

గ్యాంగ్‌స్టర్‌తో పోలీసు అధికారులు కలసి ఉన్న ఫొటోలు బహిర్గతం
- దొరికిపోయిన ఐదుగురు అధికారులు.. పోలీసు శాఖలో కలవరం
- వారిని తప్పించే ప్రయత్నం చేసిన ఓ మీడియా అధిపతి, పక్క రాష్ట్ర పెద్దలు
- ఇంతకుముందే ఆధారాల్లేవంటూ కేసును మూసేసే ప్రయత్నం
- చర్యలపై తమకు ప్రభుత్వం నుంచి ఆదేశాల్లేవన్న ఓ సీనియర్‌ ఐపీఎస్‌

ఈ ఫొటోలో ఉన్నది అదనపు ఎస్పీ చంద్రశేఖర్‌. 1989 బ్యాచ్‌ ఎస్సైగా ఎంపికైన ఆయన... ప్రస్తుతం కీలకమైన కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌లో ఇన్‌చార్జి ఎస్పీగా ఉన్నారు. గతంలో మావోయిస్టు వ్యవహారాలను పర్యవేక్షించే స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో చాలా కాలం పనిచేశారు. ఆ సమయంలోనే నయీమ్‌తో సంబంధాలు ఏర్పరచుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ వరకు కూడా సన్నిహిత సంబంధాలు నెరిపారని.. నయీమ్‌తో కలసి సెటిల్‌మెంట్లు చేశారని ఆరోపణలున్నట్లు సిట్‌ వర్గాలు వెల్లడించాయి.

చంద్రశేఖర్‌కు ఎడమవైపు కూర్చున్న అధికారి సైదులు. ప్రస్తుతం ఆయన సీఐ హోదాలో ఉన్నారు. నయీమ్‌ ఇచ్చిన దావత్‌కు చంద్రశేఖర్‌తో కలసి వెళ్లినట్టు తెలిసింది. ఇటీవలి వరకు నిజామాబాద్‌లో సీఐగా పనిచేసిన సైదులు.. ఇటీవలే సీఐడీకి బదిలీ అయ్యారు. ఎస్సైగా పనిచేసిన సమయంలో నయీమ్‌తో సంబంధాలు ఏర్పర్చుకున్నట్లు తెలిసింది.


సాక్షి, హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌తో సన్నిహిత సంబంధాలున్న పలువురు పోలీసుల బండారం బయటపడింది. నయీమ్‌తో ఏకంగా నాన్‌ కేడర్‌ అదనపు ఎస్పీ స్థాయి పోలీసు అధికారులు కూడా కలసి ఉన్న ఫొటోలు బయటపడడం సంచలనం రేపుతోంది. దాదాపు పదిహేనేళ్ల పాటు పోలీస్‌ శాఖలో పెత్తనం చెలాయించిన నయీమ్, అతడికి సహకరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసు అధికారుల ఫొటోలు గురువారం సోషల్‌ మీడియాలో వెల్లువెత్తడం పోలీస్‌ శాఖతో పాటు ప్రభుత్వ వర్గాలను అతలాకుతలం చేసింది. ఇంతకీ ఆ అధికారులెవరు? నయీమ్‌తో ఎక్కడ ఫోటోలు దిగారు? నయీమ్‌తో వారి సాన్నిహిత్యం ఏమిటి, వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, లేదా? అన్నదానిపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

కేసు విచారణ పరిస్థితేమిటి?
నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ జరిగి ఆరు నెలలు గడిచింది. పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు, రాజకీయ నేతలకు నయీమ్‌తో సంబంధాలున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై సీపీఐ నేత నారాయణ హైకోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. అయితే ఆ పిటిషన్‌ విచారణ సందర్భంగా.. ఇప్పటివరకు నయీమ్‌తో పోలీసులెవరికీ సంబంధాలున్నట్లు ఆధారాలు లభించలేదంటూ హోంశాఖ హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో ఇక నయీమ్‌ కేసులో విచారణ చాలించాలని, నయీమ్‌కు సహకారం అందించిన చిన్నా చితకా కానిస్టేబుళ్లు, ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పోలీసు శాఖకు సూచించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు సిట్‌ చార్జిషీట్లు వేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో నయీమ్‌తో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులు కలసి ఉన్న ఫొటోలు బయటకు రావడం చర్చనీయాంశమైంది. అసలు ఈ కేసు మూసివేతకు ప్రయత్నిస్తున్న సందర్భంలో కీలక ఆధారాలు బయటకు రావడం పోలీసు అధికారులను ఊపిరిపీల్చుకోకుండా చేసినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



ఈ ఫొటోలో నయీమ్‌ తో ఉన్న వ్యక్తి సీఐ వెంకట్‌ రెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్‌ లోని మలక్‌పేట ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. తను నయీమ్‌ డిగ్రీ క్లాస్‌మేట్‌ అని సిట్‌ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఆ సాన్నిహిత్యంతోనే నయీమ్‌ను కలవాల్సి వచ్చిందని, అంతకు మించి తనకు ఎలాంటి సంబంధాలూ లేవని చెప్పినట్లు తెలిసింది. అసలు గ్యాంగ్‌స్టర్‌గా మారిన నయీమ్‌ను ఎందుకు కలవాల్సి వచ్చింది, ఎంత క్లాస్‌మేట్‌ అయినా పోలీసు అధికారిగా ఉన్నప్పుడు మర్యాద పూర్వక భేటీలు ఎందుకన్న దానికి మాత్రం సమాధానమివ్వలేదని సిట్‌ వర్గాలు పేర్కొన్నాయి.

మిగతా వాళ్ల సంగతేంటి?
తాము మాత్రమే నయీమ్‌తో అంటకాగలేదని.. మరో నలుగురు కూడా నయీమ్‌తో కలసి భారీ స్థాయిలో సెటిల్‌మెంట్లు చేసి, కోట్లు దండుకున్నారని ఫోటోల్లో ఉన్న ఓ అధికారి స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్‌ విభాగంలో పనిచేస్తున్న మరో అధికారి, హైదరాబాద్‌ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ముగ్గురు డీఎస్పీలు నయీమ్‌తో అంటకాగారని ఆయన ఆరోపించారు. తమకు త్వరలో పదోన్నతి ఉందని తెలిసి, అడ్డుకునేందుకే ఈ ఫోటోలను బయటకు లీక్‌ చేశారన్నారు. తమను సిట్‌ విచారిస్తే కీలకమైన అధికారుల పేర్లు బయట పెడతామని, వారి సంగతి కూడా తేల్చాల్సిందేనని వ్యాఖ్యానించారు. తాము విచారణ ఎదుర్కొంటామన్నారు.

ఓ మీడియా ఎండీ లాబీయింగ్‌?
నయీమ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు తమపై చర్యలు తీసుకోకుండా భారీగా లాబీయింగ్‌ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఓ మీడియా ఎండీ నేరుగా కల్పించుకున్నారని, తమ సంబంధీకులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చారని విచారణ ఎదుర్కొంటున్న ఓ డీఎస్పీ వెల్లడించినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు ఆధారాలు బయటపడడంతో.. పక్క రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పెద్దల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా పేర్కొన్నట్లు సమాచారం. ఇక నయీమ్‌ ఇంట్లో దొరికిన ఆధారాల్లో చాలా వరకు చింపేసి, దొరక్కుండా చేశారని.. ప్రస్తుతం ఫోటోల్లో ఉన్న ఓ అదనపు ఎస్పీ ఏకంగా తన టీమ్‌తోనే అల్కాపురికాలనీ ఇంట్లో సోదాలు చేయించి ఆధారాలను తగలబెట్టారని ఆ డీఎస్పీ వెల్లడించినట్లు తెలిసింది.

సస్పెన్షన్‌పై మాకెలాంటి ఆదేశాల్లేవు: సీనియర్‌ ఐపీఎస్‌
నయీమ్‌ కేసుకు సంబంధించి తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ లేవని సీనియర్‌ ఐపీఎస్‌ ఒకరు వెల్లడించారు. నయీమ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను సస్పెండ్‌ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామని, దానిపై ఇంకా నిర్ణయం వెలువడలేదని పేర్కొన్నారు. నయీమ్‌తో పోలీసు అధికారులున్న ఫొటోలు బయటపడిన నేపథ్యంలో దీనిపై విచారణ జరుపుతారా, లేదా అన్నది సిట్‌ పరిధిలోని అంశమని తెలిపారు.

నయీమ్‌ ‘సన్నిహితుల’పై సిట్‌ దృష్టి
నయీమ్‌ కేసులను దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక అంశాలపై దృష్టి పెట్టింది. గ్యాంగ్‌స్టర్‌తో సన్నిహితంగా మెలిగిన పోలీసు అధికారుల్లో... పోలీసు శాఖ కోసం పనిచేసిందెవరు? వ్యక్తిగత ప్రయోజనాల కోసం దోస్తీ చేసిందెవరనేది తేల్చేపనిలో పడింది. ఎన్‌కౌంటర్‌ తర్వాత నయీమ్‌ డెన్‌లలో లభించిన డైరీలు, ఫొటోలను.. అరెస్టు చేసిన, విచారించిన వారి వాంగ్మూలాలతో సరిచూస్తోంది. ఇప్పటికే ముగ్గురు పోలీసు అధికారులపై స్పష్టమైన ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. నయీమ్‌ నేరాలతో సంబంధమున్న, అతడితో అంటకాగిన అధికారులపై వచ్చే వారంలో చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం.


ఈ చిత్రంలో నయీమ్‌తో ఉన్న పోలీసు అధికారి మద్దిపాటి శ్రీనివాసరావు. 1989 బ్యాచ్‌ ఎస్సై అయిన ఈయన ప్రస్తుతం సీఐడీలో అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు. భువనగిరి సబ్‌ డివిజన్‌లో ఎస్సై నుంచి ఇన్‌స్పెక్టర్‌ వరకు పనిచేశారు. ఎస్‌ఐబీలోనూ కొద్ది రోజులు విధులు నిర్వర్తించారు. టాస్క్‌ఫోర్స్, సీసీఎస్‌ ఏసీపీగా, మాదాపూర్‌ అదనపు డీసీపీగా కూడా పనిచేశారు.


ఈ ఫొటోలో నయీమ్‌ పక్కన నిల్చున్న పోలీసు అధికారి పేరు తిరుపత న్న. ఆయన కూడా 1989 బ్యాచ్‌కు చెందిన ఎస్సై. ప్రస్తుతం సంగారెడ్డి టౌన్‌ డీఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయన భువనగిరి సబ్‌ డివిజన్‌లో ఎస్సైగా, సీఐగా పనిచేశారు. భువనగిరిలో సీఐగా పనిచేస్తున్న సమయంలో నయీమ్‌తో కలసి వినాయక విగ్రహానికి పూజలు చేసినట్టు సిట్‌ అధికార వర్గాల ద్వారా తెలిసింది.

మరిన్ని వార్తలు