గాడ్సే నిజమైన దేశభక్తుడు

20 May, 2020 04:47 IST|Sakshi

సినీనటుడు, జనసేన నేత నాగబాబు వివాదాస్పద ట్వీట్‌

విమర్శలు గుప్పించిన నెటిజన్లు

సాక్షి, హైదరాబాద్‌: సినీనటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు వివాదాస్పద ట్వీట్‌తో వార్తల్లోకెక్కారు. మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సేను పొగుడుతూ, గాంధీజీ హత్య గురించి చర్చించాలంటూ ఆయన చేసిన ట్వీట్‌ వివాదాస్పదమవుతోంది. ‘ఈరోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశభక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా అనేది డిబేటబుల్‌. అతని వైపు వాదనని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు అంతే). గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ను ఓసారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్‌ సోల్‌ రెస్ట్‌ ఇన్‌ పీస్‌’ అంటూ మంగళవారం ఆయన చేసిన ట్వీట్‌ వివాదాస్పదమైంది. ఈ పోస్టు పట్ల నెటిజన్లు తీవ్రంగానే స్పందించారు. ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడటం వల్లే జనసేనను ప్రజలు ఆదరించలేదని, కసబ్‌ కూడా తాను నమ్మిన సిద్ధాంతం కోసం యుద్ధం చేశాడని, ఆయన దేశభక్తిని శంకించలేమని చెప్పినట్లు ఉందని కొందరు ట్వీట్‌ చేశారు. మొత్తమ్మీద గాడ్సే పుట్టినరోజు పేరుతో నాగబాబు చేసిన ఈ ట్వీట్‌ వివాదాస్పదమవుతూనే అసలీ పోస్టు ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది.. ఇందులో ఏమైనా రాజకీయ కోణం ఉందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

మరిన్ని వార్తలు