నాగం జనార్ధన్‌రెడ్డికి పుత్ర వియోగం

11 Oct, 2018 23:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి కుమారుడు నాగం దినకర్‌రెడ్డి (46) గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన వారం రోజుల కిందటే చికిత్స కోసం అపోలో ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చేసేందుకు వైద్యులు ఓ వైపు ఏర్పాట్లు చేస్తుండగానే ఆస్పత్రిలో గుండెపోటుతో చనిపోయారు. జనార్దన్‌రెడ్డికి ఇద్దరు కుమారులు కాగా పెద్ద కొడుకైన దినకర్‌రెడ్డి వైద్యవృత్తిలో కొనసాగుతూనే సివిల్‌ కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కుమారుడి మృతితో నాగం తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.   

ఈ విషయం తెలుసుకున్న పలువురు కాంగ్రెస్‌ నాయకులు అపోలో ఆస్పత్రికి చేరుకుని నాగంను పరామర్శించారు. దినకర్‌ 46 ఏళ్ల వయస్సులోనే చనిపోవడం నాగం కుటంబానికి తీరని లోటని చిన్నారెడ్డి పేర్కొన్నారు. పార్టీ తరఫున నాగం కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌తో పాటు ఆ పార్టీకి చెందిన పలువరు నాయకులు నాగంను పరామర్శించారు. 

మరిన్ని వార్తలు