బాబోయ్‌ దొంగలు

23 Mar, 2019 12:04 IST|Sakshi
జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో బీరువాలోని వస్తువులను చిందరవందరగా పడవేసిన దొంగలు (ఫైల్‌)

నగదు, బంగారం  ఇళ్లలో ఉంచొద్దు    

ఊళ్లకు  వెళితే  సమాచారం అందించాలని  పోలీసుల సూచన  

సాక్షి,నాగర్‌కర్నూల్‌ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఇటీవల చోటుచేసుకుంటున్న పలు దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కురుమూర్తి ఆలయం, అచ్చంపేట ఉమామహేశ్వరం, కొత్తకోట మండ లంలోని పలు ఆలయాల్లో చోటుచేసుకుంటున్న హుండీల చోరీలు, ఇళ్లల్లో చోరీలతో మరింత భ యానికి గురవుతున్నారు. వేసవి ఉక్కపోతకు ఇళ్లలో పడుకోలేక.. ఆరుబయట నిద్రపోదామంటే ఒకింత ఆందోళనతో ప్రజలు జంకే పరిస్థితి నెలకొంది.  

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌ 
వేసవికాలం కావడంతో చాలామటుకు గ్రామాలు, పట్టణాల్లో ఇళ్లకు తాళాలు వేసి ఆరుబయట, ఇంటి మిద్దెలపై నిద్రిస్తుంటారు. కానీ, దొంగలకు ఇదే మంచి అవకాశంగా మారుతుంది.  తాళం వేసిన ఇళ్లనే వారు టార్గెట్‌ చేసి దొరికిన కాడికి దోచుకెళుతున్నారు. ఇళ్ల యజమానులు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కష్టపడి దాచుకున్న సొమ్మును దొంగలు దోచుకెళ్లే అవకాశం ఉంది. ఇదిలాఉండగా, పార్లమెంట్‌ ఎన్నికల బందోబస్తులో పోలీసులు క్షణం తీరిక లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ వంతుగా దొంగతనాల నివారణ కోసం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు  
∙వేసవి సెలవుల్లో దూరప్రాంతాలకు వెళ్లే వారు తమ ఇంటి అడ్రస్, ఫోన్‌ నంబర్‌ను పోలీస్‌ అధికారులకు తెలియజేస్తే అలాంటి  ప్రాంతాలలో పోలీసులు నిఘా పెడతారు.  
∙విహారయాత్రలకు వెళ్లేవారు ఇళ్లలో నగదు, బంగారం, వెండి వస్తువులు, ఆభరణాలు ఉంచొద్దు. బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. 
∙పని నిమిత్తం ఎవరైనా ఇంటికి తాళం వేసి వె ళ్లాల్సి వస్తే పక్కింటి వారికి చెప్పి వెళ్లాలి. ఇళ్లు తా ళం వేసి ఉంటే దొంగతనం జరిగే ఆస్కారం ఉంది. 
∙ఇంటి ఆవరణ, కాలనీ పరిసరాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. 
∙మేడపై నిద్రించే వారు మెడలో బంగారు, వెండి ఆభరణాలు వేసుకోవద్దు. 

∙ఇళ్లలో ఉక్కబోత నుంచి ఉపశమనం కోసం కిటికీలు, తలుపులు తెరిచి నిద్రపోవద్దు. అలా ఉండడం వల్ల కిటికీ పక్కన ఉంచే షర్ట్స్, ప్యాంట్లలో నుంచి పర్సులు, నగదు, సెల్‌ఫోన్లు చోరీ అయ్యే అవకాశం ఉంది.  
∙అపరిచితులను నమ్మొదు. బంగారానికి మెరుగు పెడతామని వచ్చే వారికి విలువైన వస్తువులు ఇచ్చి మోసపోవద్దు.  
∙మహిళలు బంగారు ఆభరణాలు ధరించి బయటికి, శుభకార్యాలకు వెళ్లాల్సి వస్తే మెడచుట్టూ కొంగు కప్పుకోవాలి. లేదంటే బైక్‌లపై వచ్చి చోరీ చేసే ఆస్కారం ఉంది.  
∙తమ ఇంటి సభ్యుల సౌకర్యార్థం ఇంటి తాళాన్ని పరిసరాల్లో, కిటికీల పక్కన పెట్టవద్దు. దొంగలు వాటిని గుర్తించి దొంగతనం చేసే అవకాశం ఉంది. 
∙వేసవి కావడంతో తాళం వేసిన ఇంటి ముందు వాహనాలు నిలపొద్దు. చోరీకి గురయ్యే అవకాశం ఉంది. జనసంచారం కల్గిన పార్కింగ్‌లలో వాహనాలు ఉంచాలి. 

∙ఊళ్లకు వెళ్లే వారు ఇళ్లలో ఓ గదిలో లైట్‌ వేసి ఉం చితే మంచిది. రాత్రి వేళలో లైట్‌ వెలుగుతూ ఉం టే ఇంట్లో ఎవరో ఉన్నారని దొంగలు ఊహిస్తారు.  
∙ఇంటి డోర్లకు సెంట్రల్‌ లాకింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవడం సురక్షితం. అలాగే, ఇంటి గేట్లకు సైరన్లను బిగించుకోవాలి. అపరిచితులు గేటు డోర్లను ముట్టుకుంటే శబ్దం వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. 
∙ఇంటి పరసరాల్లో అపరిచిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.  ఏదైనా సమాచారాన్ని అందించాలి అనుకుంటే 100 నంబర్‌కు డయల్‌ చేయాలి.  
 
     

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు