చకచకా

24 May, 2015 23:57 IST|Sakshi

నాగార్జునసాగర్ ఆధునికీకరణలో భాగంగా మొదటి ప్యాకేజీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2016 జూలై నాటికి పనులు పూర్తికావాల్సి ఉంది. ఇప్పటికే 90 శాతం సీసీ లైనింగ్ పూర్తికాగా, కేవలం నాలుగు
 కిలోమీటర్ల మేర పెండింగ్‌లో ఉంది.
 
 హాలియా : ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహకారంతో చేపట్టిన నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆధునికీకరణ పనులు మొదటి ప్యాకేజీలో శరవేగంగా జరుగుతున్నాయి. 2016 జూలై నెలాఖరు నాటికి కాల్వ  పనులు పూర్తి కావాల్సి ఉంది. అంటే మరో ఏడాది సమయమే ఉండటంతో పనులు ఊపందుకున్నాయి. ఎడమ  కాల్వలో అల్వాల, తెట్టేకుంట, కొత్తపల్లి గ్రామాల వద్ద నీటికి అక్కడక్కడ అడ్డుకట్టలు వేయడంతోపాటు పేరుకుపోయిన షిల్ట్‌ను తొలగిస్తున్నారు. మరోవైపు కాల్వ సీసీ లైనింగ్, కాల్వకట్టపై మట్టిపోసే పనులు నిర్వహిస్తున్నారు. పనులు ఇలాగే కొనసాగితే మరో నెల నుంచి రెండు నెలలలోపే మొదటి ప్యాకేజీ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.
 
 4 కిలోమీటర్ల మేర సీసీ లైనింగ్..
 ఆధునికీకరణ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ఎడమ కాల్వను ఐదు ప్యాకేజీలుగా విడదీశారు. 0 నుంచి 29.291 కిలోమీటర్ వరకు మొదటి ప్యాకేజీగా నిర్ణయించారు. 95.49కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు. ఇప్పటికే 90 శాతం సీసీ లైనింగ్ పూర్తయ్యింది. మరో 4 కిలోమీటర్ల మేర (తెట్టెకుంట నుంచి అల్వాల వరకు) సీసీ లైనింగ్ పనులు మిగిలి ఉన్నాయి. అదే విధంగా డీప్‌కట్‌లో షాట్‌క్రీట్ పనులు 1.5 కిలోమీటర్లు మిగిలాయి.
 

మరిన్ని వార్తలు