సోమ లేక మంగళ!

25 Aug, 2018 01:42 IST|Sakshi

సాగర్‌ గేట్లు తెరిచే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణమ్మ పరవళ్లు నిరంతరాయంగా కొనసాగుతుండటంతో నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రవాహాలు ఇలాగే కొనసాగితే వచ్చే సోమ లేక మంగళవారం ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టానికి చేరే అవకాశం ఉంది. అదే జరిగితే ఈ నెలలోనే ప్రాజెక్టు గేట్లు ఎత్తే చాన్స్‌ ఉందని ప్రాజెక్టు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో 248 టీఎంసీల నిల్వలు ఉండగా, మరో 64 టీఎంసీలు నీరు చేరితే ప్రాజెక్టు నిండు కుండను తలపించనుంది. ఎగువ కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్‌ల్లోకి ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఆల్మట్టికి 1.21 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది. తుంగభద్రకు 49వేల క్యూసెక్కుల వరదొస్తోంది. ఇక రాష్ట్ర పరిధిలోని జూరాలకు 1.50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే నీటిని దిగువకు వదిలేస్తున్నారు.

శ్రీశైలానికి 1.98 లక్షల క్యూసెక్కుల ప్రవాహమొస్తోంది. గురువారంతో పోలిస్తే కాస్త తగ్గినా, మెరుగ్గానే ప్రవాహాలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రాజెక్టు నుంచి 2.11 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ సాగర్‌కు వదిలారు. ఇందులో 1.82 లక్షల క్యూసెక్కులు సాగర్‌కు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు మొత్తం నిల్వ 312 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 245 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వ ద్వారా 7,420 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఆల్మట్టి, నారాయణపూర్‌కు ప్రవాహాలు నిలిచి గేట్లు మూసినా, ఆల్మట్టి నుంచి సాగర్‌ వరకు నదీ గర్భంలో గరిష్టంగా 100 టీఎంసీల నీరు ఉంటుందని, ఇందులో 70 నుంచి 80 టీఎంసీలు సాగర్‌ చేరినా, ప్రాజెక్టు నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఎస్సారెస్పీకి 8,535 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో అక్కడ 70 టీఎంసీల నిల్వలున్నాయి. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు