నాగార్జున సాగర్‌ గేట్లు ఎత్తివేత

9 Sep, 2019 20:26 IST|Sakshi

సాక్షి, నల్గొండ: ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో నాగార్జున సాగర్‌ క్రస్టు గేట్లను సోమవారం అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో నాగార్జున సాగర్‌ గేట్లు మరోసారి తెరుచుకున్నాయి. 8 గేట్లు ఎత్తి  సుమారు అయిదు అడుగుల వరకు ఉన్న నీటిని దిగువకు విడుదల చేశారు. కాగా రెండు రోజుల పాటు వరద కొనసాగే  అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం ఉదయం వరకు నాగార్జుసాగర్‌లోని నీటిని సమీక్షించి గేట్ల సంఖ్య పెంచాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటామని సాగర్‌ ఎస్‌ఈ ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. 

కాగా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేయడంతో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరింది. సాగర్‌ జలాశయ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు. ఇక ఎగువన కృష్ణా పరీవాహక ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద రాక పెరిగింది. దీంతో ఆ ప్రాజెక్టుల గేట్లు తెరుచుకున్నాయి. దిగువకు వరద నీరు భారీగా వస్తుండటంతో ముందుస్తుగానే నారాయణపూర్‌, జూరాల ప్రాజెక్టుల గేట్లు ఎత్తి కృష్ణానదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు.

మరిన్ని వార్తలు