మళ్లీ అదే గొడవ..?

1 Feb, 2018 03:42 IST|Sakshi

సాగర్‌ ఎడమ కాల్వ కింద నీటి వినియోగంపై సంక్లిష్టత

సాక్షి, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వల కింద నీటి వినియోగంపై మళ్లీ రచ్చ మొదలైంది. ఎడమ కాల్వ కింద కృష్ణా బోర్డు చేసిన కేటాయింపులకు, జరిగిన వినియోగానికి మధ్య పొంతన లేకపోవడంతో వివాదం ముదురుతోంది. ఎడమ కాల్వ కింద తమకు 12 టీఎంసీల మేర కేటాయింపులు చేసినా, ఇంతవరకు 6.61 టీఎంసీల నీరే వినియోగం జరిగిందని, మిగతా నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని ఏపీ బోర్డును ఆశ్రయించడం ప్రస్తుత వివాదానికి ఆజ్యం పోస్తోంది. సాగర్‌ ఎడమ కాల్వ కింద గుంటూరు జిల్లాలోని ఆయకట్టుకు నీరందించేందుకు ఏపీ శ్రీశైలం నుంచి 15.61 టీఎంసీలు విడుదల చేయగా, సాగర్‌ నుంచి ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు.

అయితే గడిచిన మూడు నెలల్లో తమకు కేటాయించిన 12 టీఎంసీల నీటిలో 6.61 టీఎంసీలు మాత్రమే వచ్చాయని చెబుతోంది. మిగతా నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని బోర్డుకు మంగళవారం లేఖ రాసింది. గతంలో ఇలాంటి సమస్య వచ్చినా ఇంతవరకు తేలలేదు. ప్రస్తుతం సాగర్‌లో 529 అడుగుల్లో మాత్రమే నీరు ఉంది. ఇప్పటికిప్పుడు సాగర్‌ నుంచి ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసినా పూర్తి స్థాయిలో ఏపీకి నీళ్లు అందుతాయన్న ఆశలు లేవు. ఈ నేప థ్యంలో మళ్లీ శ్రీశైలం నుంచి నీటి విడుదల చేయడం అత్యావశ్యకంగా మారుతోంది. ఈ సమయంలో సాగర్‌కు శ్రీశైలం నుంచి నీటి విడుదల జరుగుతుందా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇలాంటి సమయం లో సాగర్‌ నుంచి ఏపీ అవసరాల నిమిత్తం ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయాలంటూ బుధవారం పదవీ విరమణకు కొన్ని గంటల ముందు బోర్డు చైర్మన్‌ శ్రీవాత్సవ తెలంగాణను ఆదేశిస్తూ లేఖ రాయడం గమనార్హం. 

10.8 టీఎంసీ తక్కువ చూపారన్న తెలంగాణ 
ఇక పోతిరెడ్డిపాడు వినియోగం కింద ఏపీ తన వాస్తవ వినియోగం కన్నా తక్కువ చూపిందంటూ తెలంగాణ బుధవారం బోర్డుకు లేఖ రాసింది. పీఆర్‌పీ కింద ఏపీ వాస్తవ వినియోగం 102.57 టీఎంసీలు ఉండగా 91.77 టీఎంసీలు మాత్రమే చూపిందని, 10.80 టీఎంసీలు తక్కువ చూపిందంటూ ఫిర్యాదు చేసింది. 
 

మరిన్ని వార్తలు