వివాదంలో మరో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే!

11 Dec, 2017 03:47 IST|Sakshi

నల్లగొండ డీసీసీబీ సీఈవోపై వేముల వీరేశం దుర్భాషలు

సస్పెండైన ఓ ఉద్యోగిని విధుల్లోకి తీసుకునే వ్యవహారంలో వివాదం

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన ఫోన్‌కాల్‌ రికార్డింగ్‌

దుర్భాషలాడటంపై సర్వత్రా చర్చ

మహిళా అధికారిని వేధిస్తుండటంతోనే నిలదీశా: వీరేశం

సాక్షి, హైదరాబాద్‌ : అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) సీఈవో మదన్‌మోహన్‌ను నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. ఇందుకు సంబంధించిన ఫోన్‌ కాల్‌ సంభాషణ ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇందులో అధికారిని ఎమ్మెల్యే బూతులు తిట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. డీసీసీబీలో సస్పెన్షన్‌కు గురైన డీజీఎం స్థాయి ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకునే వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యేకు, సీఈవోకు మధ్య ఈ సంభాషణ జరిగింది. దేవరకొండ డీసీసీబీ బ్రాంచిలో అవినీతికి పాల్పడిన వారిపై కేసు పెట్టిన మహిళా అధికారిని సస్పెండ్‌ చేశారని.. తిరిగి విధుల్లోకి తీసుకోకుండా వేధిస్తుండడంతో తాను గట్టిగా నిలదీశానని ఎమ్మెల్యే వీరేశం చెబుతున్నారు.

అధికారి, ఎమ్మెల్యేల ఫోన్‌కాల్‌ సంక్షిప్తంగా..
ఎమ్మెల్యే: సీఈవోగారు చిన్న పని..
సీఈవో: చైర్మన్‌ గారికి చెప్పాను సార్, మండే వస్తారు..
ఎమ్మెల్యే: ఒకరోజు టైం ఇవ్వండి అన్నావు కదా..
సీఈవో: చైర్మన్‌గారికి చెప్పాను సార్‌.. మండే వచ్చి చూస్తానని చైర్మన్‌గారు చెప్పారు సార్‌..
ఎమ్మెల్యే: దీంట్లో చైర్మన్‌కు ఏం పని?
సీఈవో: చైర్మన్‌ సంతకం పెట్టాలి సార్‌
ఎమ్మెల్యే: బైలా ప్రకారం జీఎం, డీజీఎం, అసిస్టెంట్‌ జీఎం దాకా సీఈవోనే ఫైనల్‌ అని ఉంది. బుక్కు ప్రింట్‌ చేసినోడు తప్పు చేసిండా. జీవో ఇచ్చినోడు తప్పు చేసిండా. మరి మీరు తప్పు చేస్తున్నరా.. నాకు అర్థం కావట్లే..
సీఈవో: లేదు సార్‌.. నేను తప్పు కాదు సార్‌
ఎమ్మెల్యే: మండే నేను వస్తా. నాకు ఆర్డర్‌ కాపీ ఇస్తవా..?  
సీఈవో: సరే సార్‌.. మండే రోజు చైర్మన్‌ సార్‌ వస్తానన్నరు సార్‌.
ఎమ్మెల్యే: ఏయ్‌..! చెప్పేది వినాలి.. డ్రామా చేయకు. మొన్న ఏం చెప్పినవ్‌. ఒకరోజు టైమివ్వండి.. నేను హ్యాండికాపిడ్‌.. కథ కార్కానమ్‌ అని చెప్పినవా.. లేదా..
సీఈవో: చెప్పిన సార్‌..  
ఎమ్మెల్యే: ఇప్పటి వరకు ఫైల్‌ పెట్టినవా?  
సీఈవో: ఫైల్‌ పెట్టిన సార్‌.. చైర్మన్‌కు పెట్టిన
ఎమ్మెల్యే: ఫైల్‌ ఎక్కడ ఉంది.. ఫైల్‌ నంబర్‌ చెప్పు
సీఈవో: ఫైల్‌ చైర్మన్‌గారికి పెట్టాను సార్‌.. నంబర్‌ లేదు దానికి
ఎమ్మెల్యే: చైర్మన్‌ సంతకం ఎందుకు చెల్లుతది.. ఎంప్లాయికి..?
సీఈవో: ఇది వరకు చైర్మన్‌నే ఆర్డర్‌ ఇచ్చారు సార్‌
ఎమ్మెల్యే: వాడెవెడు ఆ పనికి.. నువ్వు ఎవడు.. వానిది నీది ..... నీ అయ్య జాగీరా.. చైర్మన్, నువ్వు ఇద్దరం దోచుకుతింటమని రాసకొచ్చుకున్నరా.. వాడి మీద నువ్వు.. నీ మీద వాడు.. ఇద్దరిదీ పలగ్గొడతా.. నేను మంచిగుంటెనే మంచోణ్ని.. ఒక రోజు టైం అడిగినవ్‌.. సరేనన్న.. నువ్వు ఇంకా ఫైలే పెట్టకుండా మళ్లీ చైర్మన్‌ అనే వెధవ గురించి నాకు చెప్పొద్దు. ఉద్యోగం ఇస్తవా.. లేదా.. లేకుంటే నిన్ను, నీ చైర్మన్‌ను, సంపత్‌రెడ్డి అనేటోణ్ని ముగ్గురి ..... పలగ్గొడతా ఆడికి వచ్చి ... సంపత్‌ రెడ్డిగాడు నాయి ఊరికనే 8 లక్షలు తీసుకుండు. వాని ఓటు అమ్ముకోవడానికి రూ. 8 లక్షలు తీసుకుండు. నీక్కూడా డబ్బులు కావాలంటే చెప్పు ఇస్తం.
సీఈవో: నేను అలాంటి వాడిని కాదు సార్‌..
ఎమ్మెల్యే: అలాంటోడివి కావైయితివి.. సిస్టమ్‌ను ఫాలో అయితున్నంటివి.. ఆంధ్రా నుంచి వచ్చి మా దగ్గర ఉద్యోగం చేస్తుంటివి. మమ్ముల్ని ... కుడిపితివి ఎట్లా..  
సీఈవో: చైర్మన్‌గారు సంతకం పెడితే ఇస్తాను సార్‌
ఎమ్మెల్యే: నువ్వు రూల్స్‌ పాటించకుండా ఎట్లా ఆపుతవ్‌.. ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నవ్‌.. కోర్టు నిన్ను జైల్లో ఎందుకు పెట్టకూడదు.. మీ బ్యాంకర్‌ చైర్మన్‌కు ఫిర్యాదు చేయాలా.. పది లక్షలు డిమాండ్‌ చేస్తుండు.. లేకుంటే ఇస్తలేడని సీఎం కాడ ఫిర్యాదు చేస్తా..
సీఈవో: మండే చైర్మన్‌ వస్తానన్నాడు సార్‌
ఎమ్మెల్యే: చైర్మన్‌ మాట ఎత్తొద్దు. డ్రామాలు వినను. నా దగ్గర బైలా బుక్‌ ఉంది. యాక్ట్‌లు చదువుకో. నీకు మెయిల్‌ చేస్తా. మల్లికార్జున్‌ వస్తడు పని చేసిపెట్టు. లేదంటే నాకు ఇక్కడి నుంచి 30 నుంచి 40 నిమిషాలు జర్నీ. నేనే వస్తా..

ప్రజల పక్షాన మాట్లాడుతా..
‘‘దేవరకొండ సొసైటీ బ్యాంకులో 21 మంది అవినీతికి పాల్పడ్డారు. డీజీఎం లక్ష్మిని విచారణాధికారిగా నియమించారు. ఆమె అవినీతికి పాల్పడిన వారిపై దేవరకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. కానీ డీజీఎం తమను డబ్బులు అడిగిందని వాళ్లు తిరిగి కేసు పెట్టారు. దీంతో రెండేళ్ల కింద డీజీఎంను సస్పెండ్‌ చేశారు. ఏడాది నుంచి తిప్పుతున్నారు. ఆరు నెలల నుంచి జీతం ఇవ్వడం లేదు. పది లక్షలు ఇస్తే ఉద్యోగంలోకి తీసుకుంటామన్నరు. ఆమె వికలాంగురాలు. నేను న్యాయం పక్షాన నిలబడి ప్రశ్నించిన. ప్రజల పక్షాన నిలదీస్తా.. నీ సంగతి చూస్తా అని కూడా మాట్లాడుతా. నాకు నటించడం రాదు. ఇట్లనే జీవిస్తం..’’
– వేముల వీరేశం, నకిరేకల్‌ ఎమ్మెల్యే

కావాలనే ఇబ్బంది పెడుతున్నారు
‘‘2013లో దేవరకొండ బ్రాంచిలో అక్రమాలు జరిగాయి. నన్ను విచారణాధికారిగా వేశారు. అవినీతికి పాల్పడిన వారిపై కేసు పెట్టాను. అప్పటినుంచి బ్యాంకులో డైరెక్టర్లు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. 2015లో నన్ను కావాలనే సస్పెండ్‌ చేశారు. రెండేళ్లు పూర్తయింది. తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు శుక్రవారం ఆర్డర్‌ కాపీ ఇస్తామన్నారు. అసలు ఈ వ్యవహారంలో డీసీసీబీ చైర్మన్‌కు సంబంధం లేదు. సీఈవో కావాలనే అలా చెబుతున్నారు. డైరెక్టర్లు సీఈవోపైన ఒత్తిడి చేస్తున్నారు..’’
– సస్పెన్షన్‌కు గురైన డీజీఎం లక్ష్మి

మరిన్ని వార్తలు