మతంపై యుద్ధం చేయాల్సిన దుస్థితి

13 Jan, 2020 03:13 IST|Sakshi

విరసం ముగింపు సభలో కవి నాళేశ్వరం శంకరం

సాక్షి, సుందరయ్య విజ్ఞానకేంద్రం: దేశంలో పరిస్థితులను చూస్తుంటే మతంపై యుద్ధం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రముఖ కవి, తెలంగాణ రచయితల సంఘం సభ్యుడు నాళేశ్వరం శంకరం అన్నారు. విప్లవ రచయితల సంఘం(విరసం) ఏర్పడి 50 ఏళ్లయిన సందర్భంగా ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజ లకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. ప్రజలకు మాట్లాడే హక్కు లేకపోవటం బాధాకరమన్నారు. చివరకు దేశంలో పౌరులు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో అనేక ధిక్కార స్వరాలు వెల్లువెత్తటానికి విరసం కూడా కారణమన్నారు. వ్యవస్థ మార్పుతోపాటు పితృస్వామ్యం, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన చైతన్యాలు తెలుగు సాహిత్య రంగాన్ని ప్రభావితం చేశాయన్నారు. తెలంగాణ సాహితి ప్రతినిధి భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక కవులు, రచయితలపై దాడులు పెరిగాయని అన్నారు.విరసం సభ్యుడు చంద్రయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ రచయితలు పీసీ రాములు, సంగిశెట్టి శ్రీనివాస్, తైదల అంజయ్య, కె.శివారెడ్డి, అమ్మంగి వేణుగోపాల్, శిఖామణి, కొండేపూడి నిర్మల, వేంపల్లి షరీఫ్, ప్రొఫెసర్‌ కాశీం, రివేరా తదితరులు పాల్గొన్నారు. 

విరసం రాష్ట్ర కొత్త కార్యవర్గం ఎన్నిక 
విరసం రాష్ట్ర కొత్త కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా అరసవెల్లి కృష్ణ, కార్యదర్శిగా ప్రొఫెసర్‌ కాశీం, ఉపాధ్యక్షునిగా బాసిత్, సహాయ కార్యదర్శిగా రివేరా, కార్యవర్గ సభ్యులుగా పాణి, వరలక్ష్మి, ఉజ్వల్, రాంకి, రాము, చిన్నయ్య తదితరులు ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు