‘వరి’వడిగా సాగు...

15 Sep, 2019 02:34 IST|Sakshi

ఖరీఫ్‌లో రికార్డులను మించి సాగవుతున్న వరి

కరీంనగర్‌ జిల్లాలో అత్యధిక సాగు

పత్తి సాగులో అగ్రస్థానంలో నల్లగొండ జిల్లా

సాక్షి నెట్‌వర్క్‌: ఈ ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో వరి సాగుపై సందేహాలు నెలకొన్నాయి. సరిపడా వర్షాలు లేకపోవడంతో రైతులు ఈ పంట సాగుపై ఆశలు వదులుకున్నారు. దీంతో సీజన్‌ మధ్యలోకి వచ్చేసరికి కూడా వరి సాధారణం కంటే చాలా తక్కువగా సాగులోకి వచ్చింది. కురవబోయే వర్షాలను నమ్ముకుని అక్కడక్కడా నాట్లు వేసిన పరిస్థితి.. కానీ, పదిహేను రోజుల క్రితం కురిసిన వర్షాలతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వరినాట్లు రికార్డు స్థాయిలో పడ్డాయి. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో నాట్లు పడుతున్నాయి. సెప్టెంబర్‌ 12వ తేదీ వరకు నమోదైన గణాంకాలను బట్టి.. తెలంగాణలో ఈ ఖరీఫ్‌లో వరి గత విస్తీర్ణపు రికార్డులను మించి సాగవుతోందని తేలింది. ఇంత భారీ విస్తీర్ణంలో వరి సాగు కావడం ఇదే ప్రథమమని వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో ఇప్పటి వరకు పత్తి అత్యధికంగా సాగులోకి రాగా, వరి తరువాత స్థానంలో ఉంది. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే కరీంనగర్‌ జిల్లాలో వరి అత్యధికంగా సాగవుతోంది. ఈ జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణానికి మించి సాగు (5,03,038 ఎకరాలు)లోకి రావడం విశేషం. నిజామాబాద్‌ (4,92,831 ఎకరాలు), నల్లగొండ (4,78,275 ఎకరాలు) జిల్లాలు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ఈ పంట సాగు (61,435 ఎకరాలు)లో చివరి స్థానంలో నిలుస్తోంది.

మొత్తానికి తెలంగాణలోని 9 ఉమ్మడి జిల్లాల్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 31,38,419 ఎకరాలు కాగా, ఈ నెల 12 వరకు 30,03,041 ఎకరాల్లో సాగులోకి వచ్చింది. పత్తి సాగులో నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఈ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణాన్ని మించి ఏకంగా 8,54,265 ఎకరాల్లో సాగవుతోంది. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్‌ జిల్లాలు తరువాత స్థానాల్లో ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో అతి తక్కువగా 42,899 ఎకరాల్లో సాగవుతోంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 41,94,717 ఎకరాలు కాగా, అంతకుమించి 43,40,353 ఎకరాల్లో సాగులోకి వచ్చింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా