బావిలో పడిన దుస్తులు తీయబోయి..

21 Jul, 2019 07:53 IST|Sakshi
బావిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

ఊపిరాడక ఒకరి మృతి

నార్కట్‌పల్లి మండలం చిన్నతుమ్మలగూడెంలో ఘటన

నార్కట్‌పల్లి (నకిరేకల్‌) : చేతబావిలో పడిన దుస్తులను తీసేందుకు అందులోకి దిగిన ఓ వ్యక్తి ఊపిరాడక మృతిచెందాడు. ఈ ఘటన నార్కట్‌పల్లి మండలం చిన్నతుమ్మలగూడెంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండ బీమార్జున్‌రెడ్డి (38) వ్యవసాయ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం తన ఇంటి ఆవరణలో  50 ఫీట్ల లోతు ఉన్న చేత బావిలో పిల్లలు పడేసిన స్కూల్‌ యూనిఫాం (దుస్తులను) తీయడానికి తాడు సహాయంతో అందులోకి దిగాడు.

 గంట సమయం గడిచినా..
బీమార్జున్‌రెడ్డి గంట సమయం గడిచినా బావిలోంచి బయటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గ్రామస్తులకు సమాచారం అందజేశారు. అక్కడికి వచ్చిన కొందరు బావిలోకి దిగేందుకు ప్రయత్నించారు. కొద్దిగా బావిలోపలికి వెళ్లాక ఊపిరి ఆడడం లేదని బయటికి వచ్చారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు కామినేని ఆస్పత్రి నుంచి ఆక్సీజన్‌ తెప్పించి బావి లోకి పంపించారు. బావిలోంచి బీమార్జున్‌రెడ్డి ఉలుకుపలుకు లేకపోవడంతో చివరకు అగ్ని మాపక ఇబ్బంది అందులోకి దిగారు. 5 గం టల గడిచిన తర్వాత బీమార్జున్‌రెడ్డిని బయటికి తీశారు. తక్షణమే అతడిని కామినేని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. బావిలో ఊపిరాడకనే బీమార్జున్‌రెడ్డి మృతి చెందాడని డాక్టర్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య కుమారుడు, కూతురు ఉన్నారు. ఘటన స్థలాన్ని తహసీ ల్దార్‌ శ్రీదేవి, ఎస్‌ఐ విజయ్‌కుమార్, ఆర్‌ఐ మంగ , అగ్నిమాపక, 108 సిబ్బంది, ఎంపీటీసీ ఉండ్ర భాగ్యమ్మ లింగరెడ్డి, సర్పంచ్‌ రాజు, మాజీ సర్పంచ్‌ కోల్లు రాంరెడ్డి పరిశీలించారు. బావిలో విషవాయువుల మూ లంగా శ్వాసఆడక మృతి చెందినట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు