నల్లగొండకు  దేశవ్యాప్త గుర్తింపు

17 Mar, 2019 19:00 IST|Sakshi

పార్లమెంట్‌ ఎన్నికల్లో తొలి ప్రధాని నెహ్రూ కంటే ఎక్కువ ఓట్ల మెజార్టీ సాధించిన రావి నారాయణరెడ్డి

పీడీఎఫ్‌ నుంచి పోటీ చేసి 2.72లక్షల మెజార్టీ పొందిన నేత

1952 నుంచి ఇప్పటి దాకా ఒక ఉప ఎన్నిక సహా 17 సార్లు ఎన్నికలు

18వ ఎన్నిక ముంగిట్లో నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గం   

సాక్షి, నల్ల గొండ : పార్లమెంట్‌ ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభా నియోజకవర్గానికి దేశ స్థాయిలో గుర్తింపు ఉంది. 1952లో ఏర్పాటైన ఈ నియోజకవర్గానికి ఒక ఉప ఎన్నిక సహా 2014 వరకు 17 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. 1952, 1957లో ద్విసభా నియోజకవర్గాలుగా ఉంది. నల్లగొండ లోక్‌సభా నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడెం, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో  కాంగ్రెస్‌ అభ్యర్థి వీబీ రావుపై గెలిచారు. ఆ ఎన్నికల్లో రావి నారాయణరెడ్డికి ఏకంగా 2,72,280 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇది దేశవ్యాప్తంగా అత్యధిక మెజార్టీ.

తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కంటే రావికి ఎక్కువ ఓట్లు  రావడంతో పార్లమెంట్‌ భవనంలోకి తొలి అడుగు పెట్టే (ప్రారంభోత్సవం) అవకాశం రావి నారాయణరెడ్డికి దక్కింది. తొలి ఎన్నికల్లో రావి పీడీఎఫ్‌ నుంచి పోటీ చేసి గెలిచారు. సాయుధ పోరాటాన్ని నడిపిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)పై నిషేధం ఉండడంతో సాయుధపోరాట యోధులంతా తొలి ఎన్నికల్లో ప్రగతిశీల ప్రజాస్వామ్య వేదిక (ప్రొగ్రెసివ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ /పీడీఎఫ్‌) తరపున పోటీ చేశారు. దేశంలో తొలి ఎన్నికల్లో 489 పార్లమెంట్‌ స్థానాల్లో ఆ రకంగా నల్లగొండకు గుర్తింపు లభించింది. రావి నారాయణరెడ్డి తిరిగి 1962లో జరిగిన మూడో ఎన్నికల్లో నల్లగొండ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కేవీపీ రావుపై 33,396 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాగా 1960లో నల్లగొండ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగగా కాంగ్రెస్‌ నుంచి వి.కాశీరాం ఇండిపెండెంట్‌ అభ్యర్థి పెద్దయ్యపై విజయం సాధించారు.

 అతిరథ నాయకులు గెలిచిన నియోజకవర్గం

నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి దేశ వ్యాప్తంగా, ఉమ్మడి రాష్ట్రంలో పేరున్న నాయకులే పోటీ చేసి గెలిచారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు రావి నారాయణరెడ్డితో పాటు దేవులపల్లి వెంకటేశ్వరరావు, బొమ్మగాని ధర్మభిక్షం కూడా ఈ స్థానం నుంచి విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టిన వారే. 1957 ఎన్నికల్లో నల్లగొండ ద్విసభకు దేవులపల్లి వెంకటేశ్వరావు పీడీఎఫ్‌ నుంచి పోటీపడి కాంగ్రెస్‌ అభ్యర్థి జీఎస్‌రెడ్డిపై 53,214 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సీపీఐ జాతీయ కార్యదర్శిగా పనిచేసిన సురవరం సుధాకర్‌రెడ్డి ఈ నియోజకవకర్గం నుంచి 1998, 2004 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక ప్రస్తుత సిట్టింగ్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒక్కరే ఈ నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు గెలిచి రికార్డు సాధించారు. మొదట ఆయన టీడీపీ నుంచి 1999 ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత 2009, 2014 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో గెలిచాక ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆది నుంచీ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్యనే పోరు సాగింది. టీడీపీ కేవలం రెండు సార్లు గెలవగా, బీజేపీ అసలు బోణీ చేయలేదు. 1971 ఎన్నికల్లో మాత్రం తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్‌) ఒక సారి ఇక్కడి నుంచి గెలిచింది. మొత్తంగా నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గం ఎన్నికల చరిత్ర అంతా ఆసక్తికరంగానే ఉంది.  

మరిన్ని వార్తలు