నకిలి విత్తనాల గుట్టు రట్టు చేసిన పోలీసులు

23 Jun, 2020 17:51 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, నల్గొండ: జిల్లా పోలీసులు భారీ అంతర్ రాష్ట్ర నకిలీ విత్తనాల రాకెట్‌ను మంగళవారం ఛేదించారు. ఈ రాకెట్‌కు సంబంధించిన 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30లక్షల విలువైన 15 క్వింటాళ్ల పత్తి విత్తనాలను, వాటిని ప్యాక్ చేసే మెషినరీ సామాగ్రిని, సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా చండూర్ మండలం కమ్మగూడెంలో నాలుగు పత్తి విత్తనాల ప్యాకెట్లు సరైన ప్యాకింగ్, లేబుల్ లేకుండా కనిపించడంతో ఈ విషయం  పోలీసుల దృష్టికి వెళ్ళింది. అక్కడి నుంచి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు  తెలంగాణ నుంచి ఆంధ్రవరకు ఈ రాకెట్‌కు సంబంధం ఉన్నట్లు తెలుసుకున్నారు.  (కరోనా టెస్ట్‌ చేయలేదని నానా హంగామా)

దీంతో ఎస్పీ రంగనాధ్ జిల్లా స్థాయిలో ఏఎస్పీ సతీష్ నేతృత్వంలో ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం రంగంలోకి దిగి దీనితో సంబంధం ఉన్న వారిని ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుని విచారించింది. దీంతో పలు పోలీసు స్టేషన్ల పరిధిలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. గద్వాల జోగులాంబ, నాగర్ కర్నూల్ జిల్లాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలకు చెందిన మరికొందరి పాత్ర బయటపడింది. వారిని కూడా అరెస్ట్ చేశారు. ఒక్కో లింక్ చేధిస్తున్న కొద్ది వీటిని విక్రయిస్తున్న ముఠా సభ్యులు మరికొంత మంది బయటకు వచ్చారు. నల్లగొండ జిల్లా పరిధిలోని గుర్రంపోడు, నకిరేకల్, శాలిగౌరారం, మునుగోడు, అడవిదేవులపల్లి మండలాలకు చెందిన మరికొందరి పాత్ర వెల్లడైంది.  మొత్తం 23 మందిని అరెస్ట్ చేశారు. అక్షర, ఇండిగో కంపెనీల పేరుతో వీటిని మార్కెట్ లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో వీటిని ప్యాకింగ్ చేసే వారు, రవాణా చేసే వారు, విక్రయించే వారు ఉన్నట్లు ఎస్పీ రంగనాధ్ వివరించారు. మిగిలిన వారు పరారీలో ఉన్నట్లు చెప్పారు. వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని అన్నారు. వీరిపై పీడి యాక్టు పెట్టె యోచనలో ఉన్నట్లు, అందుకు సరిపోయే ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఎస్పీ రంగనాధ్ వివరించారు. ఇప్పటికే ఈ విత్తనాలు కొని పంట వేసిన వారి వివరాలు కూడా సేకరిస్తున్నామని ఎస్పీ తెలిపారు.

(‘రైతు బంధుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’)

మరిన్ని వార్తలు