-

పోలీసులకూ తాతిల్

20 Jun, 2014 00:37 IST|Sakshi
పోలీసులకూ తాతిల్

 సాక్షిప్రతినిధి, నల్లగొండ : సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ‘పోలీసులకు.. వారాంతపు సెలవు’పై నల్లగొండ పోలీసు అధికారులు తొలిఅడుగు వేశారు. ఈ నెల 22వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా వీక్లీఆఫ్ అమలు చేయనున్నారు.  ఈ విధానం కానిస్టేబుల్ స్థాయి నుంచి సీఐల వరకూ వర్తిస్తుంది. తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక, తొలి ప్రసంగంలోనే  కేసీఆర్ పోలీసులకు వీక్లీఆఫ్ ఇస్తామని హామీ ఇచ్చారు. దీనిని ఆధారం చేసుకుని ఇటీవల నల్లగొండలో జరిగిన జిల్లా పోలీసు అధికారుల సంఘం జనరల్ బాడీ సమావేశంలో ఎస్పీ ఎదుట ఈ డిమాండ్ పెట్టారు. రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకుల కోరిక, సీఎం అప్పటికే హామీ ఇచ్చి ఉండడంతో,  ఎస్పీ అక్కడికిఅక్కడే  ఆ సమావేశంలోనే ఈ ప్రకటన చేశారు.
 
 వారం రోజులుగా కసరత్తు చేసిన జిల్లా పోలీసు అధికారులు ఏఏ పోలీసు స్టేషన్లలో ఎవరెవరికి ఏఏ రోజు వారాంతపు సెలవు ఇవ్వనున్నారో పట్టిక తయారు చేశారు. దీంతో రాష్ట్రంలో తొలిసారిగా ఈనెల 22వ తేదీ నుంచి నల్లగొండ జిల్లాలో పోలీసులకు వీక్లీఆఫ్ అమలు కానుంది. ‘డీఎస్పీ స్థాయి వరకూ ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. అందరిపైనా పనిఒత్తిడి ఉంది. ఇది మానసిక ఒత్తిడికి దారితీస్తోంది. అయినా, తొలిఅడుగు పడింది. దీనికి సీఎం కేసీఆర్‌కు, హోం మినిష్టర్, డీజీపీలకు ముఖ్యంగా నల్లగొండ ఎస్పీకి కృతజ్ఞతలు చెబుతున్నాం. రాష్ట్రంలోని ఇతర జిల్లాల ఎస్పీలు కూడా ఈ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం..’ అని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి వివరించారు.
 
 జిల్లాలో 3వేల సిబ్బందికి ఊరట
 నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 123 పోలీస్‌స్టేషన్ల పరిధిలో 3వేల మంది పోలీసు సిబ్బంది పనిచేస్తున్నారు. వీరు కాకుండా, మరో 850 మంది హోంగార్డులు, 680 మంది ఆర్ముడు రిజర్వు పోలీసులు ఉన్నారు. కానిస్టేబుల్ నుంచి సీఐ స్థాయి అధికారుల వరకు ఇక నుంచి వీక్లీ ఆఫ్ దక్కనుంది.  ‘ ఇంత మంది పోలీసు కుటుంబాల్లో సంతోషం నింపే నిర్ణయం తీసుకున్న ఎస్పీ ప్రభాకర్‌రావు, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. సిబ్బంది మరింత సమర్థతతో పనిచేయడానికి ఇది దోహదం చేస్తుంది..’ అని జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు రామచంద్రం అభిప్రాయపడ్డారు.
 
 లబ్ధిపొందేది వీరే...
 కానిస్టేబుళ్లు    1850
 హోంగార్డులు    850
 ఏఆర్ పోలీసులు    680
 హెడ్‌కానిస్టేబుళ్లు    366
 ఏఎస్‌ఐలు    166
 ఎస్‌ఐలు    150
 సీఐలు    37
 

మరిన్ని వార్తలు