మా గ్రామాలను ఆ జాబితానుంచి తొలగించడం అన్యాయం...

13 Apr, 2018 13:20 IST|Sakshi

రాజకీయ కారణాలతో అలా చేశారు

జోక్యం చేసుకుని న్యాయం చేయండి

హైకోర్టులో టీపీసీసీ ఎస్‌టీ విభాగం వైస్‌ చైర్మన్‌ పిటిషన్‌

పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌ : నల్లగొండ జిల్లా, పెద్దవూర మండలంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న గ్రామ పంచాయతీల జాబితా నుంచి రామన్నగూడెం తండా, ఎనిమిది తండాలను తొలగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ రెండు తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలన్న పంచాయతీరాజ్‌ కమిషనర్‌ లేఖ ఆధారంగా జిల్లా కలెక్టర్‌ ప్రతిపాదనలు సిద్ధం చేశారని, అయితే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆ ప్రతిపాదనను కలెక్టరే ఉపసహరించుకున్నారని, దీనిని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ టీపీసీసీ ఎస్‌టీ విభాగం వైస్‌ చైర్మన్‌ రమావత్‌ ప్రదాస్‌ నాయక్, రమావత్‌ నాగేశ్వరనాయక్‌లు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై గురువారం న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, రామన్నగూడెం ప్రస్తుత జనాభా 1000, ఎనిమిది తాండా జనాభా 1800పైన ఉందన్నారు. ఈ రెండు తాండాల మధ్య దూరం అరకిలోమీటరని,ప్రస్తుతం ఇవి తుంగతుర్తి గ్రామ పంచాయతీలో భాగంగా ఉన్నాయని వివరించారు.

రామన్నగూడెం, ఎనిమిది తండాల గ్రామాలకు, తుంగతుర్తికి మధ్య దూరం 4 కిలోమీటర్ల ఉందని, అక్కడి వెళ్లేందుకు సైతం సరైన రవాణా సదుపాయాలు కూడా లేవని ఆయన కోర్టుకు నివేదించారు. ఇదిలా ఉంటే 500 జనాభా, ప్రస్తుతం ఉన్న పంచాయతీకి రెండు కిలోమీటర్ల మించి దూరం ఉన్న గ్రామాలను పంచాయతీలుగా చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ఈ మేరకు తమ గ్రామాలను సైతం కొత్త పంచాయతీలుగా చేయాలని జిల్లా కలెక్టర్‌కు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ లేఖ రాశారని, ఆ లేఖ ఆధారంగా కలెక్టర్‌ ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలిపారు. అకస్మాత్తుగా జిల్లా కలెక్టర్‌ తమ గ్రామాలను కొత్త పంచాయతీల జాబితా నుంచి తొలగించారని, కేవలం స్థానిక రాజకీయ నేతల నుంచి వచ్చిన ఒత్తిళ కారణంతోనే ఆయన ఇలా వ్యవహరించారని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గ్రామ పంచాయతీలయ్యేందుకు తమ గ్రామాలకు పూర్తి అర్హత ఉందని ఆయన వివరించారు. ఈ వాదనలను పరిగణలనోకి తీసుకున్న న్యాయమూర్తి, ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తన ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు