టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరు?

19 Feb, 2015 00:41 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరనే విషయంలో ఎడతెగని సస్పెన్షన్ కొనసాగుతోంది. గురువారం ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. అధికార పార్టీ తరఫున వరంగల్ జిల్లా నుంచి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీఆర్‌ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు తక్కెల్ల పల్లి రవీందర్‌రావు, మర్రి యాదవరెడ్డిలను అధినేత గురువారం తన వద్దకు రావాలని ఆదేశించారు. బీజేపీ ఇప్పటికే ఎర్రబెల్లి రాంమోహన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇదిలా ఉంటే కడియం తనకు పట్టభద్రుల కోటాలో సీటు వద్దని అధినేతను కోరినట్లు సమాచారం.

దీంతో పోటీ ముగ్గురి మధ్య నెల కొంది. గతంలో కేసీఆర్ జిల్లాకు చెందిన బండా నరేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇవ్వనున్నట్లు సూచాయగా ప్రకటించారు. మునుగోడు నియోజకవర్గానికి వచ్చినపుడు బండా నరేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని హామీ కూడా ఇచ్చారు. దీంతో ఆయన తనకు టికెట్ ఖాయమని  జిల్లాతోపాటు, వరంగల్, ఖ మ్మం జిల్లాల్లో ప్రచార పర్యటనలు చేశారు. ఇదిలా ఉంటే బండా నరేందర్‌రెడ్డికి టికెట్ విషయంలో జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేడు కేసీఆర్ అభ్యర్థిని ఫ్రకటించే అవకాశం ఉండడంతో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ బండాకు అవకాశం ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవేళ ఏదైనా మార్పు సంభవిస్తే అనూహ్యంగా కొత్త వ్యక్తికి టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
 

మరిన్ని వార్తలు