నల్లమల ముస్తాబు

20 Feb, 2020 12:39 IST|Sakshi
బౌరాపూర్‌ ఆలయం ముఖద్వారం

నేటి నుంచి 22వరకు బౌరాపూర్‌ ఉత్సవాలు  

మూడు రోజుల జాతరతో పులకించనున్న అడవితల్లి  

21న భ్రమరాంబిక, మల్లన్న కల్యాణం  

అచ్చంపేట:  నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో జరిగే బౌరాపూర్‌ చెంచుల పండుగ ఆదివాసీ చెంచుల సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. భ్రమరాంబిక, మల్లిఖార్జున స్వామి కల్యాణ మహోత్సవానికి నల్లమల ముస్తాబైంది. ఏటా శివరాత్రికి నల్లమలలోని బౌరాపూర్‌ భ్రమరాంబ ఆలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ‘చెంచుల పండుగ’ ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈనెల 20 నుంచి 22వరకు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. పురాతన ఆలయంలో కొలువుదీరిన భ్రమరాంబిక, మల్లిఖార్జున స్వామికి చెంచులు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో జరిగే ఉత్సవాల తరహాలోనే ఇక్కడ స్వామికి కల్యాణం నిర్వహిస్తారు. కొన్నేళ్లుగా ఉత్సవాలకు దూరంగా ఉన్న చెంచుల పండుగను ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏ నుంచి అధికారికంగా నిర్వహిస్తుండటంతో పూర్వవైభవం సంతరించుకుంటుంది. ప్రభుత్వం ఈఉత్సవాలకు రూ.12లక్షలు విడుదల చేసింది. అడవులు, కొండలు, వణ్యప్రాణుల మధ్యన ప్రకృతి ఒడిలో జీవనాన్ని కొనసాగిస్తున్న ఆదివాసీల పండగతో అడవితల్లి పులకించనున్నది. 

ఉత్సవాల కార్యక్రమాలు  
ఈనెల 20 నుంచి  మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు జరుగనున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా స్టాల్స్‌ ఏర్పాటు, అభివద్ధి కార్యక్రమాలపై అవగాహన, 20న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు స్వాగతోపన్యాసం కార్యక్రమాలు, సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 12గంటల వరకు చెంచుల సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలు, చెంచుల ఆట–పాట సాంప్రదాయ నృత్యాలు ఉంటాయి. 21న 11గంటలకు భ్రమరాంబ, మల్లిఖార్జునస్వామి కల్యాణం, 22న ప్రత్యేక పూజలు ఉంటాయి. నల్లమల చెంచులతో పాటు నల్లగొండ, రంగారెడ్డి, వికారాబా ద్, ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా చెంచులు అధిక సంఖ్యలో వస్తారు.  

జాతరకు వెల్లేదిలా  
జాతరకు ఆర్టీసీ బస్సులు నడుపుతారు. బౌరాపూర్‌లో జరిగే జాతరకు అమ్రాబాద్‌ మండలం మన్ననూర్‌ నుంచి 15కిలో మీటర్ల దూరంలో పర్హాబాద్‌ చౌరస్తా అటవీశాఖ వారు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్దకు చేరుకోగానే ప్రధాన రహదారి నుంచి పదిహేను కిలోమీటర్లు అడవిలోనూ ప్రయాణం చేయాలి. ఏపీ నుంచి వచ్చేవారు శ్రీశైలం నుంచి పర్హాబాద్‌ చౌరస్తా చెక్‌పోస్టు వద్దకు వచ్చి బౌరాపూర్‌ చేరుకోవచ్చు. ఐటీడీఏ పీఓ వెంకటయ్య అధికారుల సహకారంతో ఈవేడుకలు నిర్వహిస్తున్నారు. అప్పాపూర్‌ సర్పంచ్‌ బాల గురువయ్య, ఆలయ కమిటీ ఉత్సవ ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు.

మరిన్ని వార్తలు