నామా గెలుపు చారిత్రక అవసరం 

26 Mar, 2019 15:13 IST|Sakshi
మాట్లాడుతున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, చిత్రంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నామా నాగేశ్వరరావు తదితరులు 

టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలి  

నామినేషన్‌ దాఖలులో నేతల పిలుపు 

సాక్షి, ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు గెలుపు జిల్లాకు చారిత్రక అవసరమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తెలిపారు. సోమవారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు నామినేషన్‌ దాఖలు సందర్భంగా ఖమ్మంలో ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో వారు ప్రసంగించారు. ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ను గెలిపించుకొని సీఎం కేసీఆర్‌ దగ్గర జిల్లా గౌరవాన్ని నిలుపుకోవాలన్నారు. జిల్లాను మరింత అభివృద్ధి బాటలో నిలిపేందుకు నామా గెలుపు అవసరమని, కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చేయాలన్నారు.

ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో టీఆర్‌ఎస్‌ గెలుపుకై శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌  మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్‌ స్థానంలో టీఆర్‌ఎస్‌ గెలుపుబావుట ఎగురవేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచనలతో జిల్లా పెద్దలతో కలిసి నామ గెలుపుకు పని చేస్తానన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో మెజార్టీ ఓట్లు వచ్చేలా ప్రచారాన్ని ముమ్మరం చేస్తానన్నారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, కందాల ఉపేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ ఖమర్, మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.  

పూజలు చేసి,  అమరులకు నివాళులర్పించి.. 
టీఆర్‌ఎస్‌ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తన స్వగృహంలో ప్రత్యేక పూజలు చేసి, నామినేషన్‌ పత్రం నింపి ప్రదర్శనగా దాఖలుకు బయలుదేరారు. ముందుగా పెవిలియన్‌ గ్రౌండ్‌ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం బైపాస్‌రోడ్డులోని తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకొని విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి సభాస్థలికి చేరుకొని నాయకులతో కలిసి ప్రసంగించారు. సభా స్థలి నుంచి ప్రదర్శనగా నామినేషన్‌ దాఖలు కేంద్రం వద్దకు చేరుకున్నారు. 

మరిన్ని వార్తలు