మౌనం వీడిన నామా!

28 Oct, 2017 18:43 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఓ మహిళను వేధించి.. బెదిరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు.. ఈ వ్యవహారంపై ఎట్టకేలకు మౌనం వీడారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, తన గురించి అందరికీ తెలుసునని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఎవరినీ బ్లాక్‌మెయిల్‌ చేయలేదని అన్నారు.

'ఏం జరిగిందో నాకు తెలియదు. ఎవరో చెబితే విన్నాను. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత స్పందిస్తాను' అని ఆయన అన్నారు. మీపై కేసు పెట్టిన సుజాతా రామకృష్ణన్‌ మీకు తెలుసా? అని మీడియా ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండానే నామా వెళ్లిపోయారు.

మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు తనను వేధిస్తున్నారంటూ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో సుజాతా రామకృష్ణన్‌ అనే మహిళ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తన నగ్న చిత్రాలు బయటపెట్టి సమాజంలో తలెత్తుకోలేకుండా చేస్తానంటూ నామా బెదిరించారని, తనను ఆయన వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తను ఒంటరిగా నివసిస్తున్నానని, నామా నాగేశ్వర్‌రావు నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు చెప్పారు. 2013 నుంచి నామా నాగేశ్వర్‌రావు తనకు స్నేహితుడని, అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేవారని తెలిపారు. అయితే గతంలో కర్ణాటకకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ నామాపై వేధింపుల కేసు పెట్టిందని.. దీనిపై తాను నిలదీయడంతో తనపైనా వేధింపులు మొదలుపెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆయన ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ నిండా వేశ్యలే..!
బాధిత మహిళ స్వయంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. 'సాక్షి'కి ఎక్స్‌క్లూజివ్‌గా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. తనను అందరూ చూస్తారనే భయం లేదని, తన మొహాన్ని బ్లర్‌ చేయొద్దని కూడా కోరారు. నామా నాగేశ్వర్‌రావు ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ నిండా వేశ్యలే ఉన్నారని చెప్పారు. మీ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా తనను వేధిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశానని తెలిపారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు తాను నామాతో మాట్లాడిన ఆడియో, వీడియో టేపులను కూడా వాట్సాప్‌ చేశానని, వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నామా, సీతయ్యలపై కేసు నమోదు
మహిళను బెదిరించిన వ్యవహారంలో మాజీ ఎంపీ నామా, సీతయ్యలపై కేసు నమోదు చేశామని, నామా బెదిరించిన ఆడియో, వీడియో టేపులు తమ వద్ద ఉన్నాయని బంజరాహిల్స్‌ ఏసీపీ మురళి తెలిపారు. నామా, సుజాతా రామకృష్ణన్‌ మధ్య విభేదాలు ఏంటనేది తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ కేసు వెనుక పొలిటికల్‌ మోటివ్‌ ఉందా? లేదా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నామని చెప్పారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా