అనగనగా ఓ అనాథ

3 Jan, 2015 02:15 IST|Sakshi
అనగనగా ఓ అనాథ

ఆ చిన్నారి ఊహ తెలియని వయస్సులోనే తండ్రి మరణించాడు. తల్లి కూతురిని వదిలి ఎక్కడికి వెళ్లిందో తెలియదు. పసిపాపను ఒంటరిగా చూడ లేక మనస్సు చలించిన ఆ ఊరి ఆర్‌ఏంపీ ఆమెను ఓ ట్రస్టులో చేర్పించాడు. నా అన్న వారు లేని ఆ అమ్మాయి ట్రస్టులోనే కష్టపడి చదివింది.ఆపై పై చదువులు కూడా ఆనాథ శరణాయాల్లోనే అభ్యసించింది. ప్రస్తుతం పోలీసు కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించింది. పన్నెండేళ్ల క్రితం తాను చదువుకున్న ప్రాంతానికే పోలీసుగా వచ్చింది. సిరిసిల్లలోనే విధులు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. -సిరిసిల్ల రూరల్
 
సిరిసిల్ల రూరల్:
బోయినపల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన మొగిలి శిరీష నా అన్న వారు లేక ఆనాథగా సిరిసిల్ల మండలం రగుడులోని రంగినేని సుజాతమోహన్‌రావు ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్టులో 2002లో చేరింది. ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అక్కడే చదివింది. 2007లో పై చదువుల కోసం ట్రస్టు నిర్వాహకుల సాయంతో హైదరాబాద్‌లోని సెంటల్ ఫర్ సోషల్ స్టడీస్‌కు వెళ్లింది. అక్కడ సెంటర్ నిర్వాహకురాలు వేమూరి విజయలక్ష్మి సాయంతో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసింది.

పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడంతో విజయలక్ష్మి సూచనతో కానిస్టేబుల్  ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. అన్ని టెస్టులో ఉత్తీర్ణురాలై 2014లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించింది. గత నెలలో అప్పాలో విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకుంది. మొదటి పోస్టింగ్ తాను చిన్నతనంలో ఆనాథగా చదువుకున్న ప్రాంతమైన సిరిసిల్లోనే రావడం కాకతాళీయంగా జరిగిపోయింది. విధుల్లో చేరడంతోనే రంగినేని ట్రస్టుకు వెళ్లి తన గురువులను కలిసింది.

చిన్నప్పటి నుంచి తనను పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించిన మోహన్‌రావు తాతయ్యను కలసి ఉద్యోగం వచ్చిన విషయం చెప్పడంతో ట్రస్టు చిన్నారులు అభినందనలు తెలిపారు. విధి వంచితురాలై ఇక్కడి ట్రస్టులోనే చదువుకొని.. ఉద్యోగం సాధించి.. సిరిసిల్లలోనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంతో పలువురికి శిరీష ఆదర్శంగా నిలుస్తోంది.
 
అనాథలకు అండగా ఉంటా : శిరీష

 నేను ఒక ఆనాథగా విద్యనభ్యసించి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి సిరిసిల్లలోనే విధులు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. నాలాంటి ఆనాథలకు నా వంతు సాయం అందిస్తా. పోలీసుగా ప్రజాసేవలో ముందుంట. ప్రస్తుతం ఉద్యోగం చేస్తూనే ఎంబీఏ చదువుతున్న. ఆపైన కూడా ఉన్నత విద్య అభ్యసిస్తూనే గ్రూప్స్‌కు ప్రిపేర్ కావాలనేది నా లక్ష్యం. కానిస్టేబుల్ ఉద్యోగం రావడంతో నా కళ్లపై నేను నిలబడటమే కాకుండా.. ఇతరుకు సైతం అండగా నిలబడే గుండెధైర్యం వచ్చింది. నాకు చదువు నేర్పించి, ప్రయోజకురాలిని చేసిన మోహన్‌రావు తాతయ్యకు జీవితాంతం రుణపడి ఉంటాను.

>
మరిన్ని వార్తలు