మానుషి ఛిల్లర్‌.. సానియా.. మిథాలీ

26 Nov, 2017 01:44 IST|Sakshi

జీఈఎస్‌ చర్చాగోష్టిలో ప్రసంగించే ప్రముఖుల పేర్లు ఖరారు 

సాక్షి, హైదరాబాద్‌: జీఈఎస్‌ సదస్సులో ప్రసంగించే ప్రముఖుల పేర్లు ఖరారయ్యాయి. మిస్‌వరల్డ్‌ మానుషి ఛిల్లర్, టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, మహిళా క్రికెట్‌  కెప్టెన్‌ మిథాలీరాజ్, బాలీవుడ్‌ నటులు సోనమ్‌కపూర్, అదితీరావు హైదరీ, నటుడు రామ్‌చరణ్, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ఈ జాబితాలో ఉన్నారు. ఈ సదస్సులో మొత్తం 50కుపైగా చర్చా కార్యక్రమాలు జరగనున్నాయి. ఎనర్జీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హెల్త్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్, ఫైనాన్షియల్‌ టెక్‌ అండ్‌ డిజిటల్‌ ఎకానమీ, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాల్లో ఈ చర్చలను నిర్వహిస్తున్నారు. 28న సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య జరిగే సదస్సు ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్, ఇవాంకా, మోదీ ప్రసంగాలు ఉండనున్నాయి. క్రీడా వ్యాపారంలో విజయం అంశంపై సానియా మీర్జా, మిథాలీరాజ్, గోపీచంద్‌లతోపాటు వన్‌ చాంపియన్‌షిప్‌ ఉపాధ్యక్షులు చాత్రి సిత్యోంద్టాంగ్‌లు మాట్లాడనున్నారు. ఫ్యూచర్‌ ఆఫ్‌ సినిమా అంశంపై రాంచరణ్‌ తేజ, అదితీరావ్‌హైదరీ, నెక్ట్స్‌ స్టేజ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ సీఈవో ఒనెకాచి స్టిఫానీ లినస్‌ ఇడాహొసాలు మాట్లాడనున్నారు. మీడియాలో మహిళలకు అవకాశాలపై మానుషి ఛిల్లర్, సోనమ్‌ కపూర్, కల్లీ పూరి తదితరులు ప్రసంగిస్తారు.

ఫలక్‌నుమాకు ‘లాడ్‌బజార్‌ ’
ఇవాంకా చార్మినార్‌ సందర్శిస్తారని, లాడ్‌ బజార్‌లో షాపింగ్‌ చేసి గాజులు కొంటారని తొలుత భావించినా.. పలు కారణాల రీత్యా భద్రతా సిబ్బంది అందుకు అంగీకరించలేదు. దీంతో లాడ్‌బజార్‌ నుంచి కొన్ని ఎంపిక చేసిన గాజుల దుకాణాలను ఫలక్‌నుమా ప్యాలెస్‌కే పంపించి.. తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మూడు దుకాణాలకు ఆర్డర్‌ కూడా ఇచ్చారు. ఎంపిక చేసిన గాజులు, ఆయా దుకాణాల నిర్వాహకులను ఫలక్‌నుమా ప్యాలెస్‌కు తీసుకెళతారు. అక్కడికి విందుకు వచ్చిన సందర్భంలో.. ఇవాంకాతోపాటు, ఇతర డెలిగేట్స్‌ కూడా గాజులు కొనుగోలు చేస్తారని అధికారులు చెబుతున్నారు.                  – సాక్షి, హైదరాబాద్‌

హైటెక్స్‌కు మినీ శిల్పారామం 
తెలంగాణ సంప్రదాయ హస్తకళలను ఇవాంకాతో పాటు ఇతర ప్రముఖులకు ప్రదర్శించనున్నారు. సదస్సు జరిగే హెచ్‌ఐసీసీకి సమీపంలోనే శిల్పారామం ఉన్నప్పటికీ.. ఇవాంకా అక్కడికి రావటం సాధ్యం కాదని ఆమె భద్రతా విభాగం స్పష్టం చేసింది. దీంతో ముఖ్యమైన హస్తకళాకృతులను హెచ్‌ఐసీసీకే తరలించి.. చిన్న ప్రదర్శన ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. అయితే దీనికి కూడా ఇప్పటివరకు అమెరికా భద్రతా సిబ్బంది నుంచి అంగీకారం రాలేదు. మరోవైపు 29న గోల్కొండ కోటలో విందు కార్యక్రమం ఉన్నందున.. శిల్పారామం నుంచి కొన్ని హస్త కళాకృతులను గోల్కొండకు తరలించి ప్రదర్శన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.      
            – సాక్షి, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు